Friday 18 October 2019

పసిమనసు


జీవితంలో ఎదురయ్యే కొన్ని సంఘటనలు మనకు ఎంతో నేర్పిస్తాయి. మన జీవితంలో చెరగని ముద్ర వేస్తాయి. 
ఈ మధ్యకాలంలో నా జీవితంలో జరిగిన ఒక మరువలేని సంఘటనని మీ అందరితో పంచుకోవాలనే నా ఈ ప్రయత్నం.
ఓ రోజు పనుండి అలా స్కూటర్లో బజారుకు వెళ్లాను. తిరిగి వస్తుండగా కొంచెం రద్దీగా ఉన్న ఒక రహదారిలో ఒక చిన్న పిల్లవాడు నా బండి కి అడ్డంగా వచ్చి నుంచున్నాడు. పది సంవత్సరాలు కూడా పూర్తిగా ఉండవు వాడికి. 
ఒక్కసారిగా నేను బండి ఆపి 'ఏంటమ్మా' అని అడిగాను. వాడు నా దగ్గరగా వచ్చి అక్కా! అక్కా! ఆకలేస్తుంది అక్కా! అన్నాడు. వాడిని చూడగానే చాలా జాలి వేసింది. అంత చిన్న పిల్ల వాడికి డబ్బులు ఇస్తే వాడు ఎక్కడ పారేసుకుంటాడో అని "సరే పదరా, నీకు ఏం కావాలో చెప్పు నేను కొనిపెడతాను" అన్నాను. 
ఆ వీధిలో ఇరు వైపులా చాలానే తినుబండారాలు ఉన్న దుకాణాలు ఉన్నాయి. సరే అని వాడి చెయ్యి పట్టు కొని వాడితో ముందుకి నడిచాను. అక్కడ ఇడ్లీ, దోశ వంటివి దొరికే చిన్న హోటల్ కనబడింది. "పదరా బాబు ఇక్కడ ఏమైనా తిందువు" అన్నాను. వాడు వెంటనే అక్కా, ఇది వద్దు అన్నాడు ముద్దుగా. సరే అని ఇంకొంచెం ముందుకు నడిచాము. అక్కడ గారెలు, బజ్జీలు, పునుగులు లాంటివి దొరికే ఒక బండి కనబడింది. నేను వాడ్ని అక్కడికి తీసుకెళ్ళాను. 
ఇదిగో బాబు అంటూ ఏదో ఆర్డర్ ఇవ్వబోయాను. అంతలో ఆ పిల్లవాడు అక్కా, అక్కా నాకు ఇది కూడా వద్దు అన్నాడు బుంగ మూతితో. అరే ఏంటి ఈ  పిల్లాడు? ఏది అడిగినా వద్దు వద్దు అంటున్నాడు అనుకుంటూ, "సరేలే, ఏం తింటావో నువ్వే చెప్పు" అన్నాను. వాడు ఇంకా ముందుకి చేయి చూపిస్తూ నన్ను తీసుకెళ్తున్నాడు. 
స్వీట్ షాపులు, పండ్ల దుకాణాలు అన్ని దాటేస్తున్నాం. నాకు ఒకటైతే స్పష్టంగా అర్థమైంది వాడికి ఏం కావాలో వాడు ముందే నిర్ణయించుకున్నాడు అని. నేను ఇంకా అటూ ఇటూ చూస్తున్నాను. కానీ అప్పుడు వాడి దృష్టి మాత్రం ఒకచోట ఆగింది. అది రోడ్డుకి అటువైపు ఉన్న ఒక బండి మీద. ఆ బండి చుట్టూ చాలామంది ఉండడంతో అక్కడ ఏముందో నాకు అర్థం కాలేదు. ఆ బండి కేసి చేయి చూపిస్తూ, వెలుగుతున్న ముఖంతో "అదిగో అక్కా, నాకు అదే కావాలి" అన్నాడు.
"ఓహో! సరేలేరా, ఇంతకీ ఏముంది అక్కడ పద చూద్దాం" అంటూ నడిచాము. 
తీరా వెళ్ళి చూశాక ఒక నిమిషం అవాక్కయ్యే పని నావంతయింది. అది చికెన్ పకోడీ అమ్మే బండి. పాపం చిన్న పిల్లవాడు కదా ఆశపడి ఉంటాడు అనుకొని, ఒక ప్లేటు ఆర్డర్ ఇచ్చాను. పిల్లాడు నా చెయ్యి కిందకి గుంజడంతో ఏంటమ్మా అంటూ అడిగాను. అక్కా, నేను ఇది ఇక్కడ తినను, ఇంటికి తీసుకు వెళ్లి తింటాను అన్నాడు. 
'అదేంట్రా చాలా ఆకలి అన్నావ్ కదా ఇక్కడే తినేసేయ్' అన్నా. 
వద్దక్కా, ఇంట్లోనే తింటాను' అని వాడు పట్టుబట్టడంతో, సరే ఐతే అని పార్సిల్ చేయించి ఇచ్చాను. అది తీసుకొని పిల్లవాడు నాకేసి ఆనందంగా చూశాడు. ఇంక ఒక్క క్షణం కూడా ఆగకుండా అక్కడినుంచి పరిగెత్తాడు.
కానీ నా మనసులో 'వీడు ఎందుకు ఇంటికి వెళ్లే తింటానని పట్టుబడుతున్నాడు' అని కొంత అనుమానం వచ్చింది. సర్లే వీడు ఏం చేస్తాడో చూద్దాం అనుకుని వాడి వెనకాలే ఫాలో అయ్యాను. 
రెండు మూడు వీధులు తిరిగాక ఓ ఇరుకు సందులోని ఒక చిన్న ఇంట్లోకి వెళ్లాడు. 
అక్కడ దాకా ఆనందంగా పరుగున వెళ్ళిన వాడు బిక్క మొహంతో అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నాడు. ఏంటో గమనిద్దామని నేను ఆ ఇంటి కిటికీ దగ్గరగా వెళ్ళి నుంచున్నాను. 
"నాన్నా, నాన్నా, ఇదిగో నీకు కావాల్సింది" అంటూ పీకల దాకా తాగేసి దొర్లుతున్న తన తండ్రికి ఆ ప్యాకెట్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. 
పూర్తిగా మత్తులో మునిగిపోయిన తండ్రికి మాత్రం అదేమీ తెలియడం లేదు. వెంటనే వాడు అక్కడే ఓ మూలగా కూర్చొని ఏడుస్తున్న తన తల్లి దగ్గరకు వెళ్ళాడు. 
"అమ్మా, ఇంక ఏడవకు, నాన్నకి కావాల్సిన చికెన్ ముక్కలు నేను తీసుకు వచ్చేసాను. ఇంక నిన్ను కొట్టడు" అని తన చిన్ని చిన్ని చేతులతో ఆమె కన్నీళ్ళు తుడుస్తూ చెప్పాడు. 
ఆమె వెంటనే వాడ్ని దగ్గరికి తీసుకొని ఆశ్చర్యంతో "ఏంటిరా, చికెన్ తెచ్చావా ఎలా తెచ్చావు?" అంటూ నిలదీసింది. ఎంత అడిగినా పిల్లాడు జవాబు ఇవ్వక పోయేసరికి ఆమెకు కోపం వచ్చింది. పిల్లాడిని దండించాలని ఆమె ప్రయత్నించడంతో నేను పరుగున లోపలికి వెళ్ళి ఆపాను. 
ఒక్కసారిగా నన్ను చూడడంతో పిల్లాడు ఇంకా బెదిరిపోయాడు. భయంతో వాళ్ళ అమ్మ వెనకగా దాక్కున్నాడు. పిల్లాడి తల్లి మీరెవరంటూ నన్ను అడిగింది. బాబుని మీరు కొట్టకండి. ఇందులో వాడి తప్పేం లేదు. వాడికి చికెన్ కొనిచ్చింది నేనే. ఇటుగా వెళ్తుంటే మీ మాటలు వినబడి ఇలా లోపలికి వచ్చాను అని సర్ది చెప్పాను. వాళ్ళ అమ్మకి నిజం చెప్పనందుకు పిల్లాడు సంతోషించాడు. అంతలో వాడి ఫ్రెండ్స్ రావడంతో వాడు వాళ్లతో కలిసి ఆడుకోవడానికి బయటకి వెళ్ళిపోయాడు. 
ఇతనేంటి? బాగా తాగి పడిపోయినట్టున్నాడు.ఇంతకీ ఎవరతను అన్నాను. వాడు నా మొగుడండి. బాగా తాగేసి చికెన్ కూర వండలేదని, జ్వరంతో ఉన్నానని కూడా చూడకుండా నన్ను బాగా కొట్టి తాగిన మత్తుకి అలా పడిపోయాడండి. నేను రోజు కూలి పని చేసి తెచ్చిన డబ్బులతోనే మా ఇల్లు గడుస్తుంది. రెండు రోజులు బట్టి జ్వరం వల్ల నేను కూలికి వెళ్ళలేదు. చేతిలో చిల్లిగవ్వ లేదు. అదేమీ పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు చికెన్ వండుతావా లేదా అని నన్ను కొడుతుంటే, "అమ్మని కొట్టద్దు", అని పిల్లాడు ఏడుస్తూ పారిపోయాడు. ఇదిగో ఇప్పుడు ఇలా చికెన్ పట్టుకొని వచ్చాడు. ఎక్కడ ఎవర్ని అడుక్కొని తెచ్చాడో అని కోపంతో వాడిని కొట్టబోయాను అంది నీరసంగా. నాకు ఒక్కసారిగా పిల్లాడు ఎందుకు అలా చేసాడో అంతా అర్థం అయిపోయింది. ఆ పసివాడు కళ్ళ ముందు మెదిలాడు.
తండ్రి తన తల్లిని కొడుతుంటే చూడలేక ఆ పసి మనసు ఎంతగా నలిగి పోయిందో నాకు అర్ధం అయ్యింది. జరిగింది ఇది అని నేను చెబితే ఆమె వాడిని ఖచ్చితంగా దండిస్తుంది. అందుకే నేను మౌనంగా అక్కడినుండి బయటికి వచ్చేశాను.

నవమాసాలు మోసి జన్మనిచ్చి, కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తన తల్లిని కాపాడటం కోసం ఆ  పసివాడు చేసిన పని తలుచుకుంటుంటే నా హృదయం బరువెక్కిపోయింది. ఏం చేసైనా వాళ్ళ అమ్మని కాపాడుకోవాలి అనుకున్నాడు అదే చేశాడు.

"అమ్మ కంటేనే వచ్చిన ఈ జన్మ అమ్మ కంటేనా?" అనుకున్న ఆ పసి మనసుని చూసి మనం ఎంతో నేర్చుకోవాలి.

-తేజ








No comments:

Post a Comment

నీ తలపు

  తలిచే నా తలపుకి ఓ పరుగే ఉంటే మరుక్షణం అది  నీ చెంతే ఉండెనులే నా ఎద సవ్వడికో పలుకే ఉంటే అది  నీ పేరే వినిపించెనులే కదిలే నా కన్నులకి ఓ భాషే...