Friday 26 July 2019

కలల ప్రపంచం


చిరుఆశల చిత్రమయిన నా కలల ప్రపంచాన...

చల్లని వహంతము, చక్కని విహంగం చెలికత్తెలై నా వెంట రాగా, ఆ నీలి గగనాన మేఘాల్ని తాకుతూ అలుపెరుగక నే సాగిపోవాలి

చల్లని కౌముది, చక్కని తారలు నా తోడై నిలవగా,
ఆ నీలి గగనాన జాబిలిని తాకుతూ నే సయ్యాటలాడాలి

చిన్నారి మీనము, చక్కని‌ మరాళము నాకు అల్లర్లు నేర్పగా, ఆ నీటి కొలనులో కలువల్ని కవ్విస్తూ నేనాటలాడాలి

చిత్రాల తరణాలు,చిలిపి తరంగాలు నా నేస్తాలై సాగగా,
ఆ నీటి సంద్రాన ముత్యాలని తాకుతూ నేనీతలాడాలి

చిరు చినుకులు, చిత్రమైన కలలు నా తోడు రాగా
ఆ రంగుల హరివిల్లు ఎక్కి సప్తవర్ణాలను నేనలదుకోవాలి

చక్కని చుక్కలు, చిత్రాల పూవులు నా వెంట రాగా
ఆ రంగవల్లుల్ని నా అరచేతిలో నింపుకొని నే మురిసి పోవాలి

తియ్యనైన జ్ఞాపకాలు, ప్రియమైన నేస్తాలు నా తోడు రాగా, ఆ కాలచక్రాన్ని ఆపి మధురమైన రోజుల్ని నే మరల తేవాలి.

-తేజ

Sunday 14 July 2019

అమ్మ


అమ్మ మరో జన్మే నా ఈ జననం 
ఆమె వదనమే తొలిసారి నేను గాంచిన  విరిసిన కుసుమం

ఆమె కన్నుల్లో కురిసే ప్రేమే తొలిసారి నేను చూసిన  అమృతవర్షం
ఆమె మాటల్లో మాధుర్యమే తొలిసారి నేను చవి చూసిన తియ్యదనం

ఆమె ధరహాసమే తొలిసారి నేను తిలకించిన హరివిల్లు
ఆమె గుండె సవ్వడే తొలిసారి నేను విన్న ప్రణవ శృతి 

ఆమె జోలపాటే తొలిసారి నేను ఆలకించిన సరాగం
ఆమె అందించిన ధైర్యం నా తొలి అడుగు తోనే ఆరంభం

ఆమె మమతల ఒడి తొలిసారి నాకు పాఠాలు నేర్పిన బడి
ఆమె నేర్పిన ప్రేమతత్వమే తొలి నుండి నేను నడిచే మార్గం

ఆమె సహవాసమే సదా గుభాళించు సౌగంధిక పుష్పం 

అమ్మ జీవితం బిడ్డలందరికీ అంకితం 
నా ఈ చిరు కవిత అమ్మలందరికీ అంకితం 

-తేజ

ఆ తలపుకు పేరేంటి?


నేను చూసే ప్రతి చూపు నీకై వెతుకుతుంటే
నాకు కనిపించే ప్రతి రూపూ నిన్నే తలపిస్తూ ఉంటే.....
ఆ తపనకు పేరేంటి?

ఉదయించే ప్రతి వేకువ వెలిగే నీ మోముని తలపిస్తుంటే
వికసించే ప్రతి కుసుమం నీ నవ్వులను చూపిస్తూ ఉంటే
ఆ తలపుకు పేరేంటి?

నేను పీల్చే ప్రతి శ్వాస నీ తలపులతో నిండుతుంటే
నేను పిలిచే ప్రతి పేరు నీ పేరులా వినిపిస్తూ ఉంటే.....
ఆ తపనకు పేరేంటి?

వర్షించే ప్రతి మేఘం నీ ఆలోచనలతో నన్ను తడిపేస్తుంటే
వరమిచ్చే ప్రతి దైవం నీలా కనబడుతూ ఉంటే...
ఆ తలపుకు పేరేంటి?

చిగురించే నా ప్రతి ఆశ నీకై తపనలతో నిండుతుంటే
మురిపించే నీ ప్రతి ధ్యాస నన్నే మైమరపిస్తు ఉంటే....
ఆ తపనకు పేరేంటి?

ఏదో తెలియని మౌనం నా పెదవులను ముడి వేస్తుంటే
ఎన్నో చెప్పాలని, ఎద ముడి విప్పాలని నా కనులు ఆరాటపడుతూ ఉంటే..
ఆ తపనకు పేరేంటి?
ఆ తలపుకు పేరేంటి?

-తేజ

Wednesday 3 July 2019

కవితాంజలి


పడి లేచే అలలా,
నా మది పడి పడి లేస్తున్నప్పుడు..స్నేహమై నిలుస్తావు
సడి చేసే సంద్రంలా,
నా మది సవ్వడి చేస్తున్నప్పుడు..చేరువై నిలుస్తావు

ఉరకలు వేస్తున్న నదిలా,
నా మది ఉల్లాసంతో సాగుతున్నప్పుడు...వారధిగా నిలుస్తావు
ఉరుములు చేస్తున్న గర్జనలా,
నా మది ఉగ్రమైనప్పుడు... ఊరటనిస్తావు

పసిపాపల బోసినవ్వులా,
నా మది స్వచ్ఛమై ఉన్నప్పుడు.... సావాసం చేస్తావు
సవ్వడి చేయని వీణలా,
నా మది బాధలో మునిగినప్పుడు... స్వాంతనగా నిలుస్తావు

చల్లని పిల్ల తెమ్మెరలా,
నా మదిలో ప్రేమ తెమ్మెర వీస్తున్నప్పుడు.. భావమై నిలుస్తావు
భగభగ మండే ఎండలా,
నా మది భగ్గున మండుతుంటే... బాసటగా నిలుస్తావు

అందమైన అక్షరాల అల్లికతో నేను చేసిన పదాల మాలికకు, నాలోని ప్రతీ భావనకు,
కవితన్న పేరుతో ఒడి పడుతున్న నా ప్రియ నేస్తమా.. నీకు నా కృతజ్ఞతాభినందనలు.

-తేజ

నీ తలపు

  తలిచే నా తలపుకి ఓ పరుగే ఉంటే మరుక్షణం అది  నీ చెంతే ఉండెనులే నా ఎద సవ్వడికో పలుకే ఉంటే అది  నీ పేరే వినిపించెనులే కదిలే నా కన్నులకి ఓ భాషే...