Wednesday 13 October 2021

నీ తలపు


 

తలిచే నా తలపుకి ఓ పరుగే ఉంటే మరుక్షణం అది 

నీ చెంతే ఉండెనులే

నా ఎద సవ్వడికో పలుకే ఉంటే అది 

నీ పేరే వినిపించెనులే

కదిలే నా కన్నులకి ఓ భాషే ఉంటే అది 

నీ కధలే లిఖించెనులే

గడిచిపోయిన క్షణాలకి ఓ అస్తిత్వం ఉంటే అవి

నీ ఊసులలో ఊయలలూగెనులే

నా పెదవంచున దాగిన మాటేదో తెలియాలంటే

నీ మూగ మనసుకి వినికిడి కావాలిలే...

కదిలే నా ఊహలకే రూపం వస్తే అది 

చూసేందుకు నీ మనసుకి కనులే కావాలిలే...


-తేజ

Saturday 3 April 2021

వసంత కోకిల

 


ఎద ఝల్లుమంటోంది 

నువ్వు అలా పిలుస్తున్న ప్రతిసారి 

నువ్వు నన్ను తలుస్తున్న ప్రతిసారి


ఎద సవ్వడి చేస్తోంది

నీ స్వరం వింటున్న ప్రతిసారి

నీ స్వరాల జల్లులో నేను తడిచిన ప్రతిసారి


ఎద ఉరకలేస్తోంది

నీ పిలుపుని నేను అనుకరిస్తున్న ప్రతిసారి

నా పిలుపుకి నువ్వు జవాబిస్తున్న ప్రతిసారి

 

ఎద వెతికేస్తోంది

ఈ పలకరింపుల వెనక ఉన్న రూపాన్ని చూసేటందుకు

ఈ దోబూచులాటలకు ఓ చరమగీతం ‌పాడేటందుకు


ఎందుకంటే నేను ఇన్నాళ్ళుగా వేచి చూస్తున్నది 

నీ రాక కోసమే కదా...


ఇప్పుడే ఎద పరవశిస్తోంది

వసంతాన్ని పిలుస్తూ ఆ చిగురుల చెంతన నువ్వు చేసే సందడి చూశాక

దాగీదాగక ఆ కొమ్మల మాటున ఉన్న నిన్ను కనులారా చూశాక

వసంత కోకిలని ఆహ్వానిస్తూ...

-తేజ

Sunday 14 March 2021

కవిత్వం


 

కాగితంపై కలం చేసే మామూలు నాట్యం కాదు కవిత్వం

అది లాస్యంతో కూడిన లయబద్దపు నాట్యం

అది గుండె పొరల నుంచి చొచ్చుకు వచ్చే

ఓ అద్భుతం, ఓ అనుభవం 

ఓ ఆలోచన, ఓ ఆనందం

ఓ ఆందోళన, ఓ ఆక్రందన

ఓ ఆవేశం, ఓ ఆవేదన

కొన్ని అక్షరపు ఆయుధాల సంయుక్తం

మరికొన్ని అంతరంగపు ఆంతరంగిక తరంగాల సమాయుక్తం

-తేజ






Monday 18 January 2021

నా స్నేహమా!


నా స్నేహమా!!

కాలపు వలలో చిక్కుకున్నా,  

కలల అలలలో ఎంతలా ఇరుక్కున్నా,

కలం పలికిన అక్షరాన్ని ఎప్పుడూ గుర్తిస్తూనే ఉన్నా 


కథలెన్ని పాఠాలు నేర్పుతున్నా

కొత్త స్నేహాలు ఎన్ని ఎదురౌతున్నా

గతం నింపుకున్న మధుర జ్ఞాపకాన్ని పలకరిస్తూనే ఉన్నా


జగమెంత మారుతున్నా

జీవితపు పేజీలెన్ని కదులుతున్నా

నా ఎద సవ్వడికో చెలిమిగా......

నిన్ను తలుస్తూనే ఉన్నా...

మరి ఇక ఎన్నటికీ మరువక తలుస్తూనే ఉంటా


-తేజ

నీ తలపు

  తలిచే నా తలపుకి ఓ పరుగే ఉంటే మరుక్షణం అది  నీ చెంతే ఉండెనులే నా ఎద సవ్వడికో పలుకే ఉంటే అది  నీ పేరే వినిపించెనులే కదిలే నా కన్నులకి ఓ భాషే...