Monday 30 September 2019

ఓ దైవీక శక్తి!


ఓ దైవీక శక్తీ,

నా ఈ జన్మల ప్రస్థానంలోకి నా ప్రమేయం  లేకుండా ప్రవేశించినా, తెలిసీ తెలియక ప్రోగు చేసుకున్న పాపపు భారాలను మోయలేక ప్రయాసపడుతున్న నన్ను, ప్రేమాప్యాయతలతో  అక్కున చేర్చుకున్న  నీకు మనసా ప్రణమిల్లుతున్నా.

నా జీవన ప్రయాణంలో ప్రవాహంలా ఎదురయ్యే ప్రతి ప్రమాదాన్ని ప్రళయంగా మారకుండా ఆపుతూ, ప్రమోదాన్ని మిగులుస్తూ నిరంతరం నాతోనే పయనిస్తూ ఉన్న నీపై నాకున్నది ప్రగాఢ విశ్వాసం.

నా అంతరంగంలో ప్రతి నిత్యం ప్రజ్వలుతున్న అలజడులకు, తలెత్తే ప్రవల్లికలకు నిరంతరం నాలోనే ఉంటూ నీ ప్రకాశంతోనే జవాబిస్తూ ఉన్న నీకిదే నా ప్రణామం.

నా ఈ యాత్ర లో ఎదురవుతున్న ప్రతిబంధకాలను ప్రావీణ్యంతో తొలగిస్తూ, నీ ప్రభోదనలతో నన్ను నిరంతరం ప్రక్షాళనగావిస్తూ, నా ప్రవర్తనను తీర్చిదిద్దుతున్న నీకు నా ప్రణుతి.

నా ప్రస్తుత పరిస్థితిలో, నా హృది ప్రాకారాలనే దాటి నువ్వు ప్రవేశించి, స్థిరంగా కొలువు తీరితే తప్ప, అచట రేగే ప్రకంపనలు తగ్గి, ఆశాజ్యోతులను వెలిగించి, స్థిర చిత్తంతో నిన్ను థ్యానించి నేను పొందగలను ప్రశాంతం.

నిరంతరం ప్రలోభాలకు లోనయ్యే నీ హృదిలో నేనెందుకు ఉండాలని నువ్వు ప్రశ్నించవచ్చు, నేనెంత పరమ పాపినో నువ్వంత పరమ కరుణామూర్తివి కదా, మరి నీ కరుణను నా పై ప్రదర్శించవా?

నాకింత చేసిన నీకు నేనేమివ్వగలను? ఈ ప్రపంచంలో నీది కానిదంటూ ఏదీ లేదే. నీదే ఐనా ప్రగాఢంగా నాది నాది అంటూ తిరిగే నా మనసు తప్ప, దాన్నే ఇస్తాను... దయతో  స్వీకరించవా
నాకు తెలుసు నా మది గది వెర్రి ఆలోచనలతో వేడెక్కి ఉందని ఐనా నీవు ఓ కారుణ్యపు నల్ల మబ్బువై వచ్చి తుషారపు వర్షాన్ని కురిపిస్తావని నా విశ్వాసం.

చివరిగా అడిగేది ఒక్కటే. నీవు నేనన్న ద్వైతమెందుకు? నిన్ను వీడి నేనున్నంతకాలం నే చేసేది తప్పులే కదా.
                                                   
 -తేజ

Sunday 29 September 2019

శ్రీమాత


మా అమ్మ సులోచని,
తన చల్లని చూపే ఈ లోకాల మనుగడత్వం

మ అమ్మ సౌదామిని,
తన మెరుపుకిరణాలే ఈ లోకంలోని వెలుగుతత్వం

మా అమ్మ సుహాసిని,
తన ధరహాసమే ఈ లోకాల ఉన్న ఆనందపారవశ్యం

మా అమ్మ సుభాషిణి,
తన స్వర మాధుర్యమే ఈ లోకాల వినిపిస్తున్న ఆనందహోలాహలం

మా అమ్మ సువాసిని,
తన సౌభాగ్యమే ఈ లోకాల నిండిన పచ్చదనం

మా అమ్మ శక్తి ప్రదాయిని,
తన శక్తి పుంజాలే ఈ లోకంలో ఉన్న సర్వ శక్తితత్వం

మా అమ్మ సౌందర్యగని,
తన సౌందర్యలహరులే ఈ లోకాల ప్రవాహిస్తన్న జీవనదులు

మా అమ్మ సర్వాంతర్యామిని,
తన వ్యాపకత్వమే ఈ లోకాల నిండిన జీవతత్వం

-తేజ

Saturday 28 September 2019

నా హృదయమా!


పిడికెడంత నా హృదయమా!
పదేపదే కదిలే నా హృదయమా!

నీ గూడు చాలా చిన్నదే కానీ
నీవు అందులో దాచేవి అన్నీ ఇన్నీ కావుగా,

నీ సవ్వడి చాలా చిన్నదే కానీ
నీవు చేసే అల్లరి అలా ఇలా ఉండదుగా,

నీ బరువు చాలా చిన్నదే కానీ
నీవు మోసే భారం మాత్రం అంతా ఇంతా కాదుగా,

నీ పరిమాణం చాలా చిన్నదే కానీ
నిన్ను ఏమారిస్తే కలిగే పరిణామం అలా ఇలా ఉండదుగా,

గుప్పెడంత నా హృదయమా!
గలగలా పలికే నా హృదయమా!

నీ వడి చాలా చిన్నదే కానీ
నీవు సృష్టించే అలజడి మాత్రం అంతో ఇంతో కాదుగా...

-తేజ

Friday 20 September 2019

కన్నీటి చుక్కలు


పుడమి దాహం వాన చుక్కలతో తొలగేనా?
పడతి బాధలు కన్నీటి చుక్కలలో కరిగేనా?

కర్షకుడి దాహం చెమట చుక్కలతో తొలగేనా?
కార్మికుడి బాధలు రక్తపు చుక్కలలో కరిగేనా?

కూటిపేదల ఆకలి గంజి చుక్కలతో తీరేనా?
అనాధల ఆక్రందన పాల చుక్కలతో తొలగేనా?

ఓ పేదవాని అంతరంగం సారా చుక్కలు తెలిపేనా?
ఓ కవిలోని అంతర్వాణి సిరా చుక్కలు తెలిపేనా?

లంచపు చేతుల మురికి నీటి చుక్కలతో తొలగేనా?
సమాజపు ఈ దుస్థితి ఓటు చుక్కలతో మారేనా?

మారిన కొత్త యంత్రాంగం మాత్రం పన్నీటి చుక్కలు కురిపించేనా??

-తేజ

Friday 13 September 2019

ఉండిపోవా


తీరం దాటిన అలలా...
నన్ను వదిలి వెళ్ళకు అలా
ఓ చిరు సవ్వడిలా...
నా గుండెలో ఉండిపోవా ఇలా

తిరిగి రాని కాలంలా...
నన్ను వదిలి వెళ్ళకు అలా
ఓ చిరు ధరహాసంలా...
నా పెదవిపై ఉండిపోవా ఇలా

చెదిరిన కలలా...
నన్ను వదిలి వెళ్ళకు అలా
ఓ చిరు వెలుగులా...
నా కళ్ళలో ఉండిపోవా ఇలా

పదమును వీడని భావంలా...
నన్ను ఎన్నటికీ వీడని నా నీడలా...
ఓ మధుర జ్ఞాపకంలా... చిరకాలం
నా మదిలో ఉండిపోవా ఇలా

-తేజ

నీ తలపు

  తలిచే నా తలపుకి ఓ పరుగే ఉంటే మరుక్షణం అది  నీ చెంతే ఉండెనులే నా ఎద సవ్వడికో పలుకే ఉంటే అది  నీ పేరే వినిపించెనులే కదిలే నా కన్నులకి ఓ భాషే...