Tuesday 20 August 2019

నువ్వా?


విరిసే మల్లెల పరిమళాల,   
మెరిసే మెరుపుల అందాల కలబోత నువ్వా?

కురిసే చినుకుల అల్లర్లను,
కరిగే మంచుల చల్లదనాలను కలగలపితే నువ్వా?

పలికే వీణల సవ్వళ్ళ,
కులికే హంసల నడకల కలబోత నువ్వా?

కవికే చిక్కని కావ్యాలను,
కలకే అందని అందాలను కలిపేస్తే నువ్వా?

నా ఎదలోని తలపులకు
నా కధలోని ఈ మలుపులకు కారణం నువ్వా?

-తేజ

Monday 12 August 2019

ఆశయసాధన



గగన వీధుల విహారం సులువు కాదని వదిలి పెట్టకు నీ  ఆశయం, ప్రయత్నమే తొలిమెట్టుగా సాగించు నీ పయనం

గగనమే హద్దని తెలుసుకొని, ఆశల ఆశయానికి నీ ఊపిరినే ఇంధనంగా, నీ శ్రమనే పెట్టుబడిగా చేసి, కష్టాలను కాళ్ళతో అణగతొక్కి మరీ సాగించు నీ పయనం

'గగనానికి నిచ్చెనలు వేయకు' అన్న ఒకనాటి మాటకై విడిచిపెట్టకు నీ ఆశయం, అంతరిక్షాన సైతం అడుగేయాలన్న తపనతో సాగించు నీ పయనం

గగనాన కమ్మిన మేఘాల ఆటంకాలను చీల్చుకొని, ఆశయ సాధనకై, మడెమ తిప్పని మార్తాండుని వలె గురిపెట్టి సాగించు నీ పయనం

గగనాన ఠీవీగా విహరిస్తున్న పక్షిరాజు రెక్కల కింద దాగిన అభయాన్ని అందుకొని ఆశయం కోసం అలుపెరుగక సాగించు నీ పయనం

గగనతలాన ఉరుముల అరుపులకి అదరక, మెరుపుల వెలుగులో, మువ్వన్నెల విల్లు వంటి నీ ఆశయ సాధనకై సాగించు నీ పయనం

గగనాన ఒంటరినౌతానని భీతి చెందకు, నీతో స్నేహానికై అదృశ్యంగా నిరీక్షిస్తున్న విజయ తారకల్ని గుర్తించి, ఓ తారాజువ్వలా సాగించు నీ పయనం

గగనమంటి ఆశయానికి గురి పెట్టు నీ నయనం
సహనంతో ముందుకు సాగించు నీ పయనం
జగానికి ఆదర్శం అవుతుంది నీ విజయం

-తేజ

చెప్పాలని ఉంది!


చెప్పలేనన్ని పదాలు ఎన్నో ఉన్నా, చప్పున చెప్పేందుకు చక్కని పదం దొరకక చిత్తైన నా గురించి చెప్పనా? లేక
చెప్పాలంటే చెప్పుకోలేనంత, చెప్పలేనంత ఉన్న చిత్రమైన నీ చరిత చెప్పనా?

చెప్పేదేదో త్వరగా చెప్పేయ్ అంటూ చిరు చప్పుడు చేస్తున్న నా మనసు గురించి చెప్పనా? లేక
చెప్పేందుకు చాలా ఉందన్నట్టు, చెప్పీ చెప్పనట్టుగా చెప్పే చూడచక్కని నీ కనుల గురించి చెప్పనా?

చెప్పలేనివన్నీ చక్కని కాగితం మీద చకచకా రాసి, చప్పున చింపేస్తున్న నా చేతుల గురించి చెప్పనా? లేక
చెప్పేందుకే ఉన్నా, చెప్పాల్సింది చెప్పకుండా దాచే చిక్కని నీ పెదవుల గురించి చెప్పనా?

చెప్పాలంటూ వచ్చి, చెప్పలేక చడీ చప్పుడు చేయక వెనకడుగేస్తున్న నా పదముల గురించి చెప్పనా? లేక
చిత్తంలో దాచుకున్న చిత్రమైన విషయాన్ని చెప్పలేక నా చుట్టూ చక్కర్లు కొడుతున్న నీ అడుగుల గురించి చెప్పనా?

చెప్పాలన్న ఆరాటాన్ని నీ గుండె చప్పుడు కింద దాచేస్తున్న నీ మూగ మనసు గురించి చెప్పనా? లేక 
అంతుచిక్కని ఆ మనసుని చకచకా చదివేస్తున్న  చక్కని నా మనసు గురించి చెప్పనా?

-తేజ

Friday 9 August 2019

స్నేహస్మృతులు


నీ మది నందనవనంలో దాగిన స్మృతిసుమాల సౌరభాల గుబాళింపు నా శ్వాసలతో జత కడుతుంటే....
నీ మది అలిందములో పదిలంగా దాచిన స్మృతి మధురాల తీయనైన రుచి నా అభిరుచులతో జత కడుతుంటే....
తిరిగి రాని కాలాన్ని గుప్పెట్లో బంధించినంత ఆనందం నన్ను చుట్టేస్తోంది

నీ మది కనుమలలో మూగ మౌనుల్లా తపమాచరిస్తున్న తియ్యని స్మృతులకు పలుకే వచ్చి నా పలుకులతో జత కడుతుంటే....
నీ మది మంజూషంలో పదిలంగా దాచిన అమూల్య  స్మృతిరత్నాల మెరుపులు మైమరపుగా నా ఆలోచనలతో జత కడుతుంటే....
తిరిగి రాని ఆ సందళ్ళని మళ్లీ ఆస్వాదిస్తున్న ఆనందం నన్ను మరింత అల్లేస్తుంది

-తేజ

Thursday 8 August 2019

ప్రేమభాష్పాలు


ఆనంద సాగర తీరాన్ని చేరిన నీ ఆశల కెరటాల ఆరాటాన్ని....
నన్నే తదేకంగా చూస్తున్న నీ కళ్ళల్లో గమనిస్తున్నా

నీ నీలికళ్ళ మేఘాలనుండి జాలువారుతున్న ప్రేమభాష్పాల‌ ఝరిని...
నన్నే తదేకంగా చూస్తున్న నీ కళ్ళల్లో గమనిస్తున్నా

స్వేఛ్ఛా విపంచివై  దహరాకాశపు అంచుల నీ ఆనందలీలా విహారాన్ని...
నన్నే తదేకంగా చూస్తున్న నీ కళ్ళల్లో గమనిస్తున్నా

నన్ను చూసిన ఆనంద పారవశ్యంలో విరిసిన నీ హృదయ కమలపు సోయగాన్ని ....
నన్నే తదేకంగా చూస్తున్న నీ కళ్ళల్లో గమనిస్తున్నా

-తేజ

నువ్విలా


అరవిరిసిన నా సుమ వదనంతో నువ్విలా దోబూచులాడుతుంటే,
నా మది సిగ్గులమొగ్గే అవుతోంది

నా సిగలోని మరుమల్లెలతో నువ్విలా గుసగుసలాడుతుంటే,
నా మది విరజాజిలా పరిమళిస్తోంది

నా చెవి లోలాకులతో నువ్విలా
సయ్యాటలాడుతుంటే,
నా మది సిరిమువ్వలా చిందే వేస్తోంది

కెంపైన నా ‌సిగ్గుల బుగ్గలపై నువ్విలా
ముద్దాడుతుంటే,
నా మది ఉప్పొంగి పరవశిస్తోంది.

పూరేకుల నా సొగసుని నువ్విలా
కౌగిట్లో బందిస్తు ఉంటే,
నా మది మౌనరాగాన్నే అందుకుంటోంది

-తేజ

Wednesday 7 August 2019

మహిళా సాధికారత


గరిట పట్టినా, గళం విప్పినా
కలం పట్టినా, కదం తొక్కినా
అందమై నిలిచినా, ఆకాశంలో ఎగిరినా
శాస్త్రాలు చదివినా, శాసనాలు చేసినా
రాణివి నీవు, రాణింపు నీది

పుట్టకముందే భ్రూణహత్యలను
పుట్టుకతోనే లింగవివక్షతను
పసితనం నుండే లైంగిక వేధింపులను
వివాహంతోనే వరకట్న వేధింపులను ఎదిరించి నిలిచే
విజయవు నీవు, విజయం నీది

తల్లివై నిలిచినా, చెల్లివై  నిలిచినా
సఖివై నిలిచినా, బిడ్డవై నిలిచినా
స్నేహితవై నిలిచినా, ప్రేమామృతాన్ని పంచే
అమృతవు నీవు, అమృతత్వం నీది

ఎందరో జీవితాలకు ఆరంభం నీ ఒడి
ఎందరెందరో మహనీయులను మలిచిన ఓ బడి
మరెందరో విజయాల వెనుక నిలిచావన్నది రూఢీ
భావితరాలకు ఆదర్శం నీ నడవడి, అందుకే
భవితవు నీవు, భవిష్యత్తు నీది

మమతానురాగాల మాలికవు నీవు
మనసెరిగి నడిచే మగువవి నీవు
మాతృత్వానికి నిలువెత్తు రూపం నీవు

మహిళను నీవు, మదిలోన విరిసిన కుసుమం నీవు
మహిళను నీవు, మహిలోన వెలసిన దేవత నీవు

-తేజ

Tuesday 6 August 2019

ఆస్వాదన


మేఘమై ప్రేమవర్షాన్ని నువ్విలా కురిపిస్తు ఉంటే,
ఆ ప్రతి బొట్టులో తడుస్తూ మరి నేను మైమరవనా

సంద్రమై ప్రేమతో నువ్విలా పిలుస్తు ఉంటే,
నదినై నిన్ను చేరేందుకు మరి నేను ఉరకలెయ్యనా

వాయువై ప్రేమతో నువ్విలా చుట్టేస్తు ఉంటే,
శ్వాసలా నిన్ను మరి నాలో చేర్చుకోనా

సుస్వరమై ప్రేమగా నువ్విలా పిలుస్తు ఉంటే, ఆసరాగాన్నే మరి నా ఎద సవ్వడిగా చేసుకోనా

ఆకాశమై నీ ప్రేమనిలా జగమంతా నింపేస్తు ఉంటే, అణువణువు నేనే అయి మరీ ఆస్వాదించనా..
మరీ మరీ ఆనందించనా..

-తేజ

Sunday 4 August 2019

శ్రీమాత


జగములనేలే తల్లి జగదీశ్వరివి నీవని విన్నా
జగములనిండిన జీవశక్తిలో నిన్ను చూస్తున్నా

సర్వజీవులలో సర్వేశ్వరివై నీవున్నావని విన్నా
సర్వజీవులలోని చైతన్యంలో నిన్ను చూస్తున్నా

లోకాల వెలుగొందుతున్న లోకేశ్వరివి నీవని విన్నా
లోకాలకు సూర్యచంద్రుల రూపంలో వెలుగులను పంచే నిన్ను చూస్తున్నా

విశ్వములను పాలించు విశ్వేశ్వరివి నీవని విన్నా
విశ్వముల నిండిన పచ్చదనంలో నిన్ను చూస్తున్నా

ప్రతిజీవిలోను ప్రాణశక్తిగా ఉన్నది నీవేనని విన్నా
ప్రతిజీవిలోనికి నిరంతరం ప్రాణవాయువై వెళ్తున్న నిన్ను చూస్తూనే ఉన్నా......

- తేజ

నీ తలపు

  తలిచే నా తలపుకి ఓ పరుగే ఉంటే మరుక్షణం అది  నీ చెంతే ఉండెనులే నా ఎద సవ్వడికో పలుకే ఉంటే అది  నీ పేరే వినిపించెనులే కదిలే నా కన్నులకి ఓ భాషే...