Wednesday 13 October 2021

నీ తలపు


 

తలిచే నా తలపుకి ఓ పరుగే ఉంటే మరుక్షణం అది 

నీ చెంతే ఉండెనులే

నా ఎద సవ్వడికో పలుకే ఉంటే అది 

నీ పేరే వినిపించెనులే

కదిలే నా కన్నులకి ఓ భాషే ఉంటే అది 

నీ కధలే లిఖించెనులే

గడిచిపోయిన క్షణాలకి ఓ అస్తిత్వం ఉంటే అవి

నీ ఊసులలో ఊయలలూగెనులే

నా పెదవంచున దాగిన మాటేదో తెలియాలంటే

నీ మూగ మనసుకి వినికిడి కావాలిలే...

కదిలే నా ఊహలకే రూపం వస్తే అది 

చూసేందుకు నీ మనసుకి కనులే కావాలిలే...


-తేజ

Saturday 3 April 2021

వసంత కోకిల

 


ఎద ఝల్లుమంటోంది 

నువ్వు అలా పిలుస్తున్న ప్రతిసారి 

నువ్వు నన్ను తలుస్తున్న ప్రతిసారి


ఎద సవ్వడి చేస్తోంది

నీ స్వరం వింటున్న ప్రతిసారి

నీ స్వరాల జల్లులో నేను తడిచిన ప్రతిసారి


ఎద ఉరకలేస్తోంది

నీ పిలుపుని నేను అనుకరిస్తున్న ప్రతిసారి

నా పిలుపుకి నువ్వు జవాబిస్తున్న ప్రతిసారి

 

ఎద వెతికేస్తోంది

ఈ పలకరింపుల వెనక ఉన్న రూపాన్ని చూసేటందుకు

ఈ దోబూచులాటలకు ఓ చరమగీతం ‌పాడేటందుకు


ఎందుకంటే నేను ఇన్నాళ్ళుగా వేచి చూస్తున్నది 

నీ రాక కోసమే కదా...


ఇప్పుడే ఎద పరవశిస్తోంది

వసంతాన్ని పిలుస్తూ ఆ చిగురుల చెంతన నువ్వు చేసే సందడి చూశాక

దాగీదాగక ఆ కొమ్మల మాటున ఉన్న నిన్ను కనులారా చూశాక

వసంత కోకిలని ఆహ్వానిస్తూ...

-తేజ

Sunday 14 March 2021

కవిత్వం


 

కాగితంపై కలం చేసే మామూలు నాట్యం కాదు కవిత్వం

అది లాస్యంతో కూడిన లయబద్దపు నాట్యం

అది గుండె పొరల నుంచి చొచ్చుకు వచ్చే

ఓ అద్భుతం, ఓ అనుభవం 

ఓ ఆలోచన, ఓ ఆనందం

ఓ ఆందోళన, ఓ ఆక్రందన

ఓ ఆవేశం, ఓ ఆవేదన

కొన్ని అక్షరపు ఆయుధాల సంయుక్తం

మరికొన్ని అంతరంగపు ఆంతరంగిక తరంగాల సమాయుక్తం

-తేజ






Monday 18 January 2021

నా స్నేహమా!


నా స్నేహమా!!

కాలపు వలలో చిక్కుకున్నా,  

కలల అలలలో ఎంతలా ఇరుక్కున్నా,

కలం పలికిన అక్షరాన్ని ఎప్పుడూ గుర్తిస్తూనే ఉన్నా 


కథలెన్ని పాఠాలు నేర్పుతున్నా

కొత్త స్నేహాలు ఎన్ని ఎదురౌతున్నా

గతం నింపుకున్న మధుర జ్ఞాపకాన్ని పలకరిస్తూనే ఉన్నా


జగమెంత మారుతున్నా

జీవితపు పేజీలెన్ని కదులుతున్నా

నా ఎద సవ్వడికో చెలిమిగా......

నిన్ను తలుస్తూనే ఉన్నా...

మరి ఇక ఎన్నటికీ మరువక తలుస్తూనే ఉంటా


-తేజ

Sunday 2 August 2020

Happy Friendship Day!




నీ స్మృతి గనిలో నేనో ధాతువునైనందుకు,

నీ జీవిత గ్రంథంలో నేనొక అక్షరమైనందుకు,

నీ అంతరంగపు తరంగాలలో నేనో వలయమైనందుకు,

నీ కవితల మాలలలో కనిపించని దారమైనందుకు,

నీ తలపుల ఝరిలో నేనో బిందువైనందుకు

ముఖ్యంగా
నీ స్నేహ పరంపరలో నేనొక స్నేహితనైనందుకు.... ఆనందంతో...

HAPPY FRIENDSHIP DAY

-తేజ

Wednesday 22 July 2020

ఓ మనసా!



ఓ మనసా!

మాంత్రికుడి ప్రాణం ఏ గుట్టమీద పుట్టలో ఉందో లేకపోతే ఏ చెట్టుమీద పిట్టలో ఉందో తెలుసుకోవచ్చునేమో కానీ మాయలు నేర్చిన నీవు ఏ మూల దాగున్నావో కనిపెట్టడం మాత్రం చాలా కష్టం సుమా!

ఆ నీలాకాశం లో చుక్కలనైనా అలవోకగా లెక్కపెట్టచ్చునేమో కానీ అవధులు లేకుండా నీవు చేసే ఆలోచనలని లెక్క కట్టడం మాత్రం చాలా కష్టం సుమా!

ఆ నల్ల మబ్బు రాల్చే వర్షపు బిందువుల నైనా లెక్కపెట్టచ్చునేమో కానీ నీవు చేసే ఆలోచనల వేగాన్ని లెక్క కట్టడం మాత్రం చాలా కష్టం సుమా!

ఆ నీలి సంద్రపు కెరటాల ఆరాటాన్నైనా అర్థం చేసుకోవచ్చునేమో కానీ అంతుచిక్కని నీ కధలను, వ్యధలను అర్థం చేసుకోవడం మాత్రం చాలా కష్టం సుమా!

ఆ నీలి సంద్రపు లోతుల్లో ఏ రత్నాలు దాగున్నాయో తెలుసుకోవచ్చునేమో కానీ తలుపులేసి దాచేసిన నీ తలపులని తెలుసుకోవడం మాత్రం చాలా కష్టం సుమా!

ఆ తీరపు తెన్నెల ఇసుక రేణువులనైనా అలా ఒడిసిపట్టి, మూటకట్టి తూకం కట్టొచ్చునేమో కానీ అలవోకగా నీవు మోసే భారాల తాలూకు బరువులను లెక్క కట్టడం మాత్రం చాలా కష్టం సుమా!

-తేజ

Wednesday 24 June 2020

వెన్నెల వర్షం


నిండు వెన్నెల్లో వర్షం ..రారమ్మంటూ నన్నే పిలుస్తోంది

మొన్న పున్నమి నాడే, కిటికీ లోంచి బయటకు చూస్తుంటే...
వర్షంలో వెన్నెల కురుస్తోందో,
వెన్నెల్లో వర్షం కురుస్తుందో అస్సలు అర్థం కాలేదు
కానీ చాలా చాలా బాగుంది

ఓ రాలే చినుకైతే తన పని తను చూసుకోకుండా నావైపే చూస్తూ అల్లరిగా పిలుస్తోంది, ఓ తుంటరి సవ్వడి చేస్తూ...

వాలే పొద్దుల్లో ఏంటే నీ సందడని దగ్గరికెళ్తే, కమ్మని వాసన చూడమంటూ మట్టిని ముద్దాడి చప్పున మాయమయ్యే...

ఆ మైమరపులో నేనుండగా నాకేం తక్కువని కస్సుమంటూ ఓ చల్లని గాలి నా చెంపను చరిచి ఎటో వెళ్లిపోయే...

దాని జాడకని నేను వెతుకుతుంటే గుండు మల్లెల గుబాళింపు గుప్పుమంటూ నా గుండెను చేరింది

ఒక్కసారిగా ఇన్ని మైమరపుల సందడి ఏంటా అని చూస్తే,
పెదవులు కురిపించే నవ్వులతో,
నవ్వులు కురిపించే రెండు పెదవులు...

మనసు కురిపించే ప్రేమతో,
ప్రేమను కురిపించే ఓ మనసు..

అకస్మాత్తుగా నా పక్కన చేరి నిలిచే ఇలా నీ రూపంలో...

-తేజ

నీ తలపు

  తలిచే నా తలపుకి ఓ పరుగే ఉంటే మరుక్షణం అది  నీ చెంతే ఉండెనులే నా ఎద సవ్వడికో పలుకే ఉంటే అది  నీ పేరే వినిపించెనులే కదిలే నా కన్నులకి ఓ భాషే...