Sunday 2 August 2020

Happy Friendship Day!




నీ స్మృతి గనిలో నేనో ధాతువునైనందుకు,

నీ జీవిత గ్రంథంలో నేనొక అక్షరమైనందుకు,

నీ అంతరంగపు తరంగాలలో నేనో వలయమైనందుకు,

నీ కవితల మాలలలో కనిపించని దారమైనందుకు,

నీ తలపుల ఝరిలో నేనో బిందువైనందుకు

ముఖ్యంగా
నీ స్నేహ పరంపరలో నేనొక స్నేహితనైనందుకు.... ఆనందంతో...

HAPPY FRIENDSHIP DAY

-తేజ

Wednesday 22 July 2020

ఓ మనసా!



ఓ మనసా!

మాంత్రికుడి ప్రాణం ఏ గుట్టమీద పుట్టలో ఉందో లేకపోతే ఏ చెట్టుమీద పిట్టలో ఉందో తెలుసుకోవచ్చునేమో కానీ మాయలు నేర్చిన నీవు ఏ మూల దాగున్నావో కనిపెట్టడం మాత్రం చాలా కష్టం సుమా!

ఆ నీలాకాశం లో చుక్కలనైనా అలవోకగా లెక్కపెట్టచ్చునేమో కానీ అవధులు లేకుండా నీవు చేసే ఆలోచనలని లెక్క కట్టడం మాత్రం చాలా కష్టం సుమా!

ఆ నల్ల మబ్బు రాల్చే వర్షపు బిందువుల నైనా లెక్కపెట్టచ్చునేమో కానీ నీవు చేసే ఆలోచనల వేగాన్ని లెక్క కట్టడం మాత్రం చాలా కష్టం సుమా!

ఆ నీలి సంద్రపు కెరటాల ఆరాటాన్నైనా అర్థం చేసుకోవచ్చునేమో కానీ అంతుచిక్కని నీ కధలను, వ్యధలను అర్థం చేసుకోవడం మాత్రం చాలా కష్టం సుమా!

ఆ నీలి సంద్రపు లోతుల్లో ఏ రత్నాలు దాగున్నాయో తెలుసుకోవచ్చునేమో కానీ తలుపులేసి దాచేసిన నీ తలపులని తెలుసుకోవడం మాత్రం చాలా కష్టం సుమా!

ఆ తీరపు తెన్నెల ఇసుక రేణువులనైనా అలా ఒడిసిపట్టి, మూటకట్టి తూకం కట్టొచ్చునేమో కానీ అలవోకగా నీవు మోసే భారాల తాలూకు బరువులను లెక్క కట్టడం మాత్రం చాలా కష్టం సుమా!

-తేజ

Wednesday 24 June 2020

వెన్నెల వర్షం


నిండు వెన్నెల్లో వర్షం ..రారమ్మంటూ నన్నే పిలుస్తోంది

మొన్న పున్నమి నాడే, కిటికీ లోంచి బయటకు చూస్తుంటే...
వర్షంలో వెన్నెల కురుస్తోందో,
వెన్నెల్లో వర్షం కురుస్తుందో అస్సలు అర్థం కాలేదు
కానీ చాలా చాలా బాగుంది

ఓ రాలే చినుకైతే తన పని తను చూసుకోకుండా నావైపే చూస్తూ అల్లరిగా పిలుస్తోంది, ఓ తుంటరి సవ్వడి చేస్తూ...

వాలే పొద్దుల్లో ఏంటే నీ సందడని దగ్గరికెళ్తే, కమ్మని వాసన చూడమంటూ మట్టిని ముద్దాడి చప్పున మాయమయ్యే...

ఆ మైమరపులో నేనుండగా నాకేం తక్కువని కస్సుమంటూ ఓ చల్లని గాలి నా చెంపను చరిచి ఎటో వెళ్లిపోయే...

దాని జాడకని నేను వెతుకుతుంటే గుండు మల్లెల గుబాళింపు గుప్పుమంటూ నా గుండెను చేరింది

ఒక్కసారిగా ఇన్ని మైమరపుల సందడి ఏంటా అని చూస్తే,
పెదవులు కురిపించే నవ్వులతో,
నవ్వులు కురిపించే రెండు పెదవులు...

మనసు కురిపించే ప్రేమతో,
ప్రేమను కురిపించే ఓ మనసు..

అకస్మాత్తుగా నా పక్కన చేరి నిలిచే ఇలా నీ రూపంలో...

-తేజ

Monday 15 June 2020

ఈ ప్రశ్నకు జవాబేది?


కన్నీరు ఆగడం లేదు
కలం కదలడం లేదు
మనసు పలకడం లేదు
మాట పెగలడం లేదు

చరిత్ర పుటల్లోకి జారుకున్న నిన్న మొన్నటి కాలం నన్ను  ప్రశ్నిస్తోంది
ఏది నా ఉనికి?
ఏది నా వైభవం?

కాల గర్భంలోకి  కనుమరుగౌతున్న పచ్చని పర్యావరణం నన్ను ప్రశ్నిస్తోంది
ఏది నా స్వచ్ఛత?
ఏది నా ఆహ్లాదం?

మట్టిలో కలిసిపోయిన కొందరి మహనీయుల ఆత్మఘోష నన్ను ప్రశ్నిస్తోంది
ఏది మా కష్టఫలం?
ఏది మా త్యాగఫలం?

నా అంతరాంతరాలలో నుండి నా హృదయవాణి నన్ను ప్రశ్నిస్తోంది
ఏమౌతుంది ఈ భవిత భవిష్యత్తు?
ఎప్పుడు తొలగేను ఈ వికృత విపత్తు?

అందుకోలేని అంబరం నుండి ఆకాశవాణి జవాబిస్తుందా?
మనందరినీ ఒడిలో దాచి లాలిస్తున్న నేలతల్లి అంతర్వాణి జవాబిస్తుందా?

-తేజ

Sunday 24 May 2020

మనిషికి మనిషే శత్రువు


కనిపించే ప్రతి మనిషిలో కనిపించని ఒక హృదయం దాగినట్టు
కనిపించే ప్రతి హృదయంలో కనిపించని ఒక వ్యధ దాగి ఉంటుంది

కనిపించే ప్రతి వ్యధ వెనక కనిపించని ఒక కధ దాగినట్టు
కనిపించే ప్రతి కధ వెనక కనిపించని మరో హృదయం దాగి ఉంటుంది

మరి ఆ కనిపించే ఆ మరో హృదయం వెనక కనిపించకుండా దాగినది మాత్రం ఖచ్చితంగా నీలాంటి ఓ మనిషే

-తేజ

Friday 22 May 2020

స్నేహ కుసుమం


తలవని తలంపుగా నిను తలచిన ప్రతీసారీ
సంతసంతో వికసించేను నా హృదయ కుసుమం 🌸

మరి, నిను తలిచీ తలవకనే చిరునవ్వుతో
వికసించేను నా అధర కుసుమం 🌸

కురిసే ప్రతి చినుకుతో విస్మయంగా వికసించేను
నా మదిలో నీ జ్ఞాపకాల కుసుమం 🌸

తరచి తరచి చూస్తే తెలిసింది
అడగని వరంగా ఆ దైవం అందించిన ఓ బహుమతే
నీ ఈ స్నేహ సౌరభ కుసుమం 🌸 అని

-తేజ

ఎదురుచూపు


కన్నులు నావి కలలు నీవి
తనువు నాది తలపు నీది
పదము నాది పథము నీది
కలం నాది కవిత నీది
మనసు నాది కానీ దాని సవ్వడి నీది

రూపు నీది ధ్యానం నాది
పేరు నీది స్మరణ నాది
రాగం నీది గానం నాది
పలుకు నీది మైమరపు నాది
మనసు నీది దానికై ఎదురుచూపు నాది

-తేజ

Tuesday 12 May 2020

మనసు మనుగడ


మౌనపు దొంతరల వెనక దాగిన మనసు
మాటలు బయటకు వినబడితే
మనుషుల మనుగడ సాగేనా?

మాటల వెల్లువలో కదిలే పెదవులు
మౌనపు దొంతరల వెనక దాగిపోతే
బంధాల మనుగడ సాగేనా?

అర్థంలేని అపార్థాల, స్వార్థాల నడుమ
మనిషి బంధీయైతే
మనసుల మనుగడ సాగేనా?

మాటను బంధించి, మనసుని బంధించి, మౌనాన్ని సంధించి పంతాలు గెలిచేనేమో
కానీ జీవితాలు గెలిచేనా??

-తేజ

Thursday 30 April 2020

నీ స్నేహం


కల అననా, కథ అననా నీ స్నేహాన్ని
కల అంటే చెదిరిపోతుంది
కథ అంటే ముగిసిపోతుంది
అందుకే తియ్యని కావ్యమంటాను
కలకాలం గుర్తుండిపోతుంది

గతమననా, గమనమననా నీ స్నేహాన్ని
గతం అంటే ఇంక తిరిగి రాదు
గమనమంటే ఏదో రోజు ఆగిపోతుంది
అందుకే జ్ఞాపకం అంటాను
కలకాలం నిలిచిపోతుంది

చిత్రమననా, చరితమననా నీ స్నేహాన్ని
చిత్రమంటే మాయమైపోతుంది
చరితమంటే పుటల్లో దాగిపోతుంది
అందుకే చిరునవ్వు అంటాను
కలకాలం కోరుకుంటాను

తుషారమననా, తుఫాననా నీ స్నేహాన్ని
తుషారం అంటే కరిగిపోతుంది
తుఫాన్ అంటే వచ్చి పోతుంది
అందుకే తొలకరి చిరుజల్లు అంటాను
కలకాలం ఎదురు చూస్తూ ఉంటాను

ఆశ అననా, పాశమననా నీ స్నేహాన్ని
ఆశ అంటే ఏదో రోజు తీరిపోతుంది
పాశమంటే ఏదో రోజు వీడి పోతుంది
అందుకే శ్వాస అంటాను
కలకాలం నాతోనే ఉండిపోతుంది

-తేజ

Tuesday 14 April 2020

కరోనా అనే నేను



కరోనా అనే నేను ✍✍

కరోనా అనే నేను
నాకే తెలియని ఓ కాలంలో
నాకే తెలియని ఈ లోకంలో
అణువంతై అంకురించి
చైనీయుల చేతిలో చిగురించి
విశ్వమంతా వ్యాపిస్తున్న ఓ వైరస్ని నేను

విశ్వానికి అలా ఓ విహారయాత్రకు వచ్చాను నేను
విశ్వమే విస్తుపోయెంత విశ్వవ్యాపిని నేను
విశ్వాన్నే చుట్టేయగల విమానాలకే విశ్రాంతినిచ్చాను నేను

విశ్వమెంత నా ముందు అని విర్రవీగుతున్న మనుషుల కుప్పి గంతులనే కట్టడి చేసాను నేను.
విద్యలను, వాణిజ్య వ్యాపారాలను, విందులను, విలాసాలను, వినోదాలను సైతం మూకుమ్మడిగా స్తంభింప చేశాను నేను
ఆఖరుకి మనుషుల ఉచ్ఛ్వాస నిశ్వాసలకే ఓ అడ్డు తెరను (మాస్క్) ధరింప చేసాను నేను

కదనరంగంలో కత్తి లేని ఒంటరి వీరుడిని నేను
కలసి ఉంటే కబళించేస్తాను అని బెదిరించి ప్రజలందరినీ విభజించేశాను నేను
ఎక్కడి వారు అక్కడే గప్ చుప్ అంటూ శాసించాను నేను
ఆఖరుకి మనుషులకి వివిక్తవాసమనే శిక్షని విధించాను నేను 
ఒకప్పటి అంటరానితనాన్ని మళ్ళీ చూసి ఆనందిస్తున్నాను నేను

విశ్వ మానవ జగతి వినాశనం నాకో వినోదభరిత విశ్వకేళి
విలయ తాండవం చేయమని మృత్యువునే శాసించాను నేను
ఆఖరుకి మృత్యువునొందిన వారిని చివరి చూపు చూసేందుకూ దారులు లేక కట్టి పడేసాను నేను.
దైన్యంగా రోదిస్తున్న వారి అశ్రువులను దప్పిక తీరని నా దాహానికి అర్ఘ్యమిస్తున్నాను నేను

కరోనా అనే నేను
కబళించేస్తాను అందర్నీ నేను

-తేజ

Tuesday 7 April 2020

నిరీక్షణ


క్షణాలు రోజులవుతుంటే,
ఆ క్షణం నాకు తెలియలేదు రోజులు నెలలు కూడా అవుతాయని నిన్ను చూసేటందుకు

రోజులు నెలలవుతుంటే,
ఆ రోజు నాకు తెలియలేదు నెలలు సంవత్సరాలు కూడా అవుతాయని నిన్ను చూసేటందుకు

నెలలు సంవత్సరాలు అవుతుంటే,
ఇప్పుడు కూడా నాకు తెలియడం లేదు
సంవత్సరాలు ఎన్ని గడిచినా,
నిన్ను చూసే రోజు అసలు ఉందా లేదా అని
నీ జాడ తెలిసే రోజు అసలు వస్తుందా, రాదా అని

-తేజ

Tuesday 31 March 2020

మనసు నవ్వింది


పలికే నీ కన్నులను చూస్తూ..పలకడమే మరచిన
నా పెదవుల్ని చూసి
నా మనసు మొదటిసారి నవ్వింది

విరిసే నీ పెదవుల్ని చూస్తూ..విరియడమే మరచిన
నా గళాన్ని చూసి
నా మనసు మరోసారి నవ్వింది

కదిలే నీ ముంగురుల్ని చూస్తూ..కదలడమే మరచిన
నా తీరుని చూసి
నా మనసు ఫక్కున నవ్వింది

చెప్పలేనంత నీ అందాన్ని చూస్తూ..అసలు విషయం చెప్పడమే మరచిన నన్ను చూసి
నా మనసు మళ్లీ నవ్వింది

ప్రేమించే నీ మనసుని చూస్తూ.. దానితో ముడి పడుతున్న తనని తాను చూసుకుంటూ
నా మనసు మళ్లీ మళ్లీ నవ్వుతోంది

-తేజ

Monday 30 March 2020

స్తబ్ధత


స్తబ్ధత

ఎన్నడు ఊహించని ఓ స్తబ్ధత
మనిషి మనుగడలో ఓ స్తబ్ధత
బతుకు గమనంలో ఓ స్తబ్ధత
పవిత్ర దేవాలయాల్లో ఓ స్తబ్ధత
భవిత విద్యాలయాల్లో ఓ స్తబ్ధత
నడి వీధుల్లో ఓ స్తబ్దత
ప్రజా విధుల్లో ఓ స్తబ్దత
వలస కూలీల బతుకుల్లో ఓ స్తబ్ధత
విలాసవంతుల ఇళ్ళల్లోనూ ఓ స్తబ్ధత

నీ నా అడుగులలో ఓ స్తబ్ధత
నా నీ మనసులలో ఓ స్తబ్ధత

కాలంలో ఓ సందిగ్ధ స్తబ్ధత
నా ఈ కలంలో ఓ స్తబ్ధత
కలికాలపు ఓ నిశ్శబ్ద స్తబ్ధత

ఇది ప్రక్షాళన పర్వమా? లేకుంటే
ప్రాయశ్చిత్తపు కర్మమా?

ఇది జగాన ప్రకృతి వైపరీత్యమా? లేకుంటే
దుర్జనుల వికృత చేష్టల ఫలితమా?

-తేజ

Thursday 26 March 2020

కరోనా కలకలం


కరోనా కలకలం

ఎటు చూసినా అస్తవ్యస్తం
ఎటు చూసినా అందోళన
ఎటు చూసినా అయోమయం
జనజీవన స్రవంతిలో చెలరేగింది ఓ కలకలం

ప్రపంచ విహారయాత్రకు కరోనా పేరుతో
వచ్చింది ఓ నిరాకార శత్రువు
నిరాకారమే కానీ నిలువెల్లా మారణాయుధం
ప్రపంచ దేశాలన్నింటి పైన ఒక్కసారిగా
ఝుళిపించింది తన కబంధ హస్తం
మానవ జాతి మనుగడపై సంధించింది తన దేహశరం

రూపం లేనిదని చిన్న చూపు వద్దు
ఆయుధమే లేని శత్రువు అని అసలే అనుకోవద్దు

బలవంతపు ఆతిథ్యం దాని తొలిమెట్టు
దేహాన్ని పూర్తిగా ఆవరించడం దాని కనికట్టు
ప్రాణాన్ని నిలువెల్లా తీయడం దాని తుదిపట్టు

దుష్టులకు దూరంగా ఉండాలన్న ఓ నీతి వాక్యాన్ని గుర్తించి అనుసరిద్దాం
ఇంటికే పరిమితమవుతూ దుష్ట కరోనాను
దరిచేరకుండా ఆపుదాం

-తేజ

Saturday 21 March 2020

నిశ్శబ్ద(కర్ఫ్యూ) తరంగాలు



నిశీధిలోని నిశ్శబ్దాన్ని కొత్తగా పగటివేళ చవి చూసిన సూరీడు, 'గతి తప్పి నేను త్వరగా ఉదయించానా' అని తడబడుతూ మబ్బుల్లో కెళ్ళి తారలతో మంతనాలు చేసొస్తుంటే,

రణగొణ ధ్వనులు, శకటపు చక్రాల శబ్దాలు ఒక్కసారిగా ఆగిపోవడంతో నా బిడ్డలకేమయిందంటూ తల్లడిల్లిన భూమాత కాలచక్రాన్ని ఆరా తీస్తుంటే,

అంతరించి పోయాఏమో అనుకున్న కొన్ని పక్షుల కిలకిలరావాలు, మేము సైతం మీ సహచరులమే అంటూ మనకి గుర్తు చేస్తూ ప్రతిధ్వనిస్తుంటే,

కృత్రిమ ధ్వనుల మధ్య పుట్టి పెరుగుతున్న నవతరపు పసిపాపలు పక్షుల ధ్వనులను పరికించి ఆస్వాదిస్తుంటే,

పులకించిన ప్రకృతి మాత ఆనందంతో తల ఊపుతూ విడుస్తున్న ఆహ్లాదకరమైన చిరుగాలి ఇప్పుడే నన్ను తాకి, నిన్ను చేరేందుకు అటుగా వస్తోంది, నువ్వు కూడా పలకరించు నేస్తమా!

-తేజ

Tuesday 18 February 2020

అంతర్వేదన


మృత్యువుతో పోరాడుతున్న ఓ రోగి అంతర్వేదన

తనది కాని వస్తువులకై
అలవోకగా కట్టిపడేస్తున్న ఆశలపాశం ఒక వైపు

రిక్త హస్తాలతో వెళ్లాలని తెలిసినా
ఆత్మీయంగా లాగుతున్న రక్తపాశం ఒక వైపు

ప్రాణాలు ఒడ్డేందుకూ సిద్దంగా ఉన్న
ప్రియతముల ప్రేమపాశం ఒక వైపు

దూరాలెందుకు మన మధ్య అంటూ
దగ్గరకొస్తున్న మృత్యుపాశం మరో వైపు

-తేజ

Thursday 13 February 2020

ఆనందబాష్పాలు


నీకై వేచి చూసిన నా కనుల తాపం ఆవిరయ్యేలా
జాలువారుతున్న నా ఆనందబాష్పాలను 
ఓ దోసిలి పట్టి పదిలంగా దాచేశా

ఓ ప్రేమ వానను నీపై కురిపిచమంటూ, దాచిపెట్టిన ఓ బాష్పాన్ని తీసి వేయి అడుగుల ఎత్తున ఉన్న నీలి మబ్బు అందుకునేలా అలా పైకెగరేసా

ఓ ప్రేమ ముత్యాన్ని నీకు బహుమతిగా ఇమ్మంటూ, మరో బాష్పాన్ని తీసి సంద్రంలో ఆటలాడుతున్న ఆల్చిప్పకు  అరువిచ్ఛా

ఓ ప్రేమ సందేశాన్ని నీకు అందించమంటూ, ఇంకో బాష్పాన్ని తీసి మేఘ బిందువు కోసం ఎదురుచూస్తున్న చాతక పక్షికి అందించా

మరి మిగిలిన మరికొన్ని బాష్పాలను భద్రంగా ఎప్పటికీ చెక్కుచెదరని నా చిత్తపు చలువ పేటికలోనే చక్కగా దాచేశా

-తేజ

Saturday 1 February 2020

స్నేహసుమం


బహు చిత్రమె ఈ జీవితం
ఆకాశంలో అరుంధతికై వెతికా దొరకలేదు
ఆల్చిప్పలో ముత్యంకై వెతికా దొరకలేదు

అరచేతిలో వైకుంఠంకై వెతికా దొరకలేదు
మట్టిలో మాణిక్యంకై వెతికా దొరకలేదు

నవ్వుల్లో ముత్యాలకై వెతికా దొరకలేదు
మాటల్లో మంత్రాలకై, మరి గాలుల్లో గంధాలకై
వెతికా, అవీ దొరకలేదు
కానీ...
కలనైనా తలవకనే జరిగిందొక అద్భుతం
ఇలనైనా వెతకకనే దొరికిందొక అమూల్యం
అది అందమైన, అపురూపమైన నీ స్నేహసుమం

-తేజ

Thursday 30 January 2020

కవన ప్రవాహం


పెదాల తలుపులు దాటి పదాల ప్రవాహం
సాగించ లేక
కరాల కదలికలు కూడ్చి కవనాల ప్రవాహం
ముందుకు సాగించా...

స్వరాల సరిగమల తోటి సందేశాల ప్రవాహం
సాగించ లేక
గారాల నయనాలను జత చేర్చి సంకేతాల ప్రవాహం ముందుకు సాగించా...

భారాల హృదయాన్ని దాటి ఊహల ప్రవాహం
సాగించ లేక
రాగాల పవనాల తోటి మెలి తిప్పి నా ఊసుల ప్రవాహం ఇలా ముందుకు సాగించా...

-తేజ

నీ తలపు

  తలిచే నా తలపుకి ఓ పరుగే ఉంటే మరుక్షణం అది  నీ చెంతే ఉండెనులే నా ఎద సవ్వడికో పలుకే ఉంటే అది  నీ పేరే వినిపించెనులే కదిలే నా కన్నులకి ఓ భాషే...