Saturday 29 June 2019

ఓ అద్వితీయ శక్తి!


ఓ అద్వితీయ శక్తి!

ఈ విశ్వమందు జీవమై నేనున్నా
ఈ విశ్వమంతా వ్యాపించి నీవున్నావు
అంటే నేనున్నది నీలోనేగా

ఈ శరీరమందు ఆత్మయై నేనున్నా
నా ఆత్మయందు అంతరాత్మవై నీవున్నావు
అంటే నీవున్నది నాలోనేగా

నీలో ఉన్న నాకు, నాలోనే ఉన్న నీ ఆశీస్సులు కోరుతున్నా

-తేజ

నీలోని నేను


నీ  కన్నుల్లో దాగిన నేను కళ్లారా గమనిస్తున్నా
రెప్పల మాటున దాగిన నీ ప్రతి కలలో ఉన్న నన్ను నేను చూస్తున్నా

నీ ఆలోచనల్లో ఉన్న నేను  పరుగులు తీస్తున్నా
పదేపదే నన్నే తలుస్తున్న నిన్నే తిలకిస్తున్నా

నీ గుండెల్లో దాగిన నేను పదిలంగానే ఉన్నా
పదేపదే నీ ఎద సవ్వడిలో నా పేరే వింటున్నా

-తేజ

ఎద సవ్వడి



నిన్ను చూసినప్పుడల్లా, "నీ వడి పెరుగుతోంది చూసుకో" అని నా గుండె గుండెతో చెప్పేది రహస్యంగా

నిన్ను తలచినప్పుడల్లా, "నీ లయ తప్పుతోంది ఏంటో" అని నా గుండె గుండెని అడిగేది రహస్యంగా

నువ్వు ఎదురైనప్పుడల్లా, "నీలో ఈ అలజడి కొత్తదే"  అని నా గుండె గుండెతో అనేది రహస్యంగా

నీతో మాట్లాడుతున్న ప్రతిసారీ, "నీ సవ్వడి వింతగా ఉందే" అని నా గుండె గుండెతో చెప్పేది రహస్యంగా

నువ్వు నేను ఒకటైనప్పటి నుంచీ, "తన చెలిమి చాలా బాగుంది" అని  నా గుండె గుండెతో చెప్తోంది సంతోషంగా
                                           
- తేజ

కాలం విలువ


గడిచిన ప్రతీ క్షణం చిత్తుగా రోదిస్తోంది
నన్ను చూసి, తిరిగి రాని తనని వృధా చేసానని

గడుస్తున్న ప్రతీ క్షణం మత్తుగా నవ్వుతుంది నన్ను చూసి, తన విలువ గుర్తించట్లేదని

గడవబోయే ప్రతీ క్షణం గమ్మత్తుగా ఆశిస్తోంది నన్ను చూసి, తననైనా సద్వినియోగించమని

గలగల సాగే క్షణమాగనిక్షణమా, ఎంతో నేర్వాలి నిన్ను చూసి, ఏదేమైనా నీదారెన్నడూ మారదని

- తేజ

Thursday 27 June 2019

ఓ మనసా!


మాటల వెనక భావాన్ని దాస్తావు
మాటలకందని మౌనాన్ని మోస్తావు

కన్నీటి వెనక వెతల్ని దాస్తావు
పన్నీటి వెనక కథల్ని మోస్తావు

చెప్పుకోలేనంత బాధని నీలో దాస్తావు
చెప్పలేనంత ప్రేమని నీవే మోస్తావు

అనుభవాల దొంతరలను నీలో దాస్తావు
ఆనందాల సంచితాలను నీవే మోస్తావు

కోటి కోరికల కోటలను నీలో దాస్తావు
కోపతాపాలను, తీపిమోహాలను నీవే మోస్తావు

ఆవేదనలను,ఆరాటాలను,ఆస్వాదనలను అలవోకగా నీలో దాస్తావు
ఆశలను,ఆశయాలను,ఆలోచనలను అలుపెరుగక నీవే మోస్తావు

నీవొక
జోలపాటల పసిపాపవా లేక జోరుగాలుల జడివానవా?
అక్షరాలు నిక్షిప్తమైన పుస్తకానివా లేక పుస్తకాలు నిక్షిప్తమైన ఓ గ్రంధాలయానివా?
లేక..అక్షరమే ఎరుగని ఓ శ్వేతపత్రానివా?

ఏ పేరున నిన్ను తలవాలో చెప్పవే ఓ మనసా!!
-
-తేజ

శ్రీమాత



అమృతమూర్తియైన మా శ్రీమాతా,

రాశి పోసిన పాపకర్మలకి ప్రతీక నేనైతే...
కదిలే కరుణా తరంగానికి ప్రతీక నీవు

మూసపోసిన అజ్ఞానానికి ప్రతీక నేనైతే...
జాలువారే ప్రేమ జలపాతానికి ప్రతీక నీవు

కరడుగట్టిన కాఠిన్యానికి మారుపేరు నేనైతే...
కమనీయమైన కారుణ్యానికి మారుపేరు నీవు

పేరుకుపోయిన అశక్తికి మారుపేరు నేనైతే...
ప్రవహించే ఙ్ఞానశక్తికి మారుపేరు నీవు

నీ ఒడి చేరేందుకు పరితపిస్తున్న పసిబిడ్డను నేనైతే...
నను లాలించే మాతృత్వానికి నిలువెత్తు ప్రతిరూపం నీవు
                                                       
- తేజ

తల్లి ప్రేమ


భూమి తన ప్రేమను ప‌చ్చదనంలో చూపిస్తే,
నీరు తన ప్రేమను జీవధారలా ప్రవహింప చేస్తుంది

అగ్ని తన ప్రేమను వేడిగా ఇస్తుంటే,
గాలి తన ప్రేమను శ్వాసగా అందిస్తుంది

ఆకాశం తన ప్రేమను వర్షంగా కురిపిస్తే,
తల్లి తన ప్రేమను రుధిరమాంసాలుగా మలచి మనకి తనువునే ఇస్తుంది

తనివి తీరా ఆనందిస్తుంది
తన జీవితాన్నే అంకితం చేస్తుంది.

-తేజ

Wednesday 26 June 2019

నీ స్నేహం


ఓ తొలకరి చిరుజల్లు తో ఆరంభమైన మన స్నేహం నన్నింకా తడుపుతోంది

ఎన్నో మధుర జ్ఞాపకాలతో నిండిన మన స్నేహం నేనెన్నడూ మరువనిది
 
కాలం చేసిన దూరం కొంతకాలమే అంటూ మళ్ళీ చిగురించె మన స్నేహం  అదెన్నడూ ఊహించనిది

వాననీరులా స్వచ్ఛమైనది మన స్నేహం అది నన్నెప్పుడూ ఆనందింపచేసేది

చిరకాలం చెరగని చిరునవ్వులా ఉండాలి మన స్నేహం అది నేనెప్పుడూ ఆశించేది

ఇప్పుడు నువ్వు నవ్వుతున్నావే అలా......
                                                                            -తేజ

నేనెవరో తెలుసుకో

సుందర సుకుమార మంజుల మందార వర్ణ భరిత పుష్పాలెన్నో సృష్టించి
సుమధుర మకరందాల మధువులను నింపి
అందున సౌగంధిక ముగ్ధ మనోహర పరిమళాలను పొదిగి
'నేనెవరో తెలుసుకో' అని ఆవల దాగున్నది ఎవ్వరు?

శీతల శ్వేతపు తుషార శిఖరాలను,జలజల జారేటి జలపాతాలను సృష్టించి
ఉరుకుల పరుగుల ప్రవహిస్తున్న నదులుగా మార్చి
అందున ఔషధ గుణాలను,జీవుల ప్రాణాధారాన్ని దాచి
'నేనెవరో తెలుసుకో' అని ఆవల దాగున్నది ఎవ్వరు?

సంద్రాల నీటిని ఆవిరిగా మార్చి, రాగాల మేఘాలను సృష్టించి
అరిచేటి ఉరుములు, మెరిసేటి మెరుపుల మధ్య కురిసేటి వర్షాలను సృష్టించి
పరవశించి ఆడే మయూరాలను, వయ్యారి వానవిల్లును సృష్టించి
అందున ఎన్నెన్నో వర్ణాలని దాచి
'నేనెవరో తెలుసుకో' అని ఆవల దాగున్నది ఎవ్వరు?

యుగయుగాల తరబడి మూగ మౌనుల్లాగా నిశ్చలమై నిల్చిన గిరులను సృష్టించి,
మాటెరుగని మానుల్ని, పశుపక్షుల్ని సృష్టించి
పచ్చని పైరు పాపలను చల్లగా లాలించే చిరుగాలిని సృష్టించి
అందున అలవోకగా శ్వాసవాయువును దాగుంచి
'నేనెవరో తెలుసుకో' అని ఆవల దాగున్నది ఎవ్వరు?

సూర్యచంద్రుల్ని, చుక్కల్ని ఒడిసి పట్టుకునే ఆకాశాన్ని సృష్టించి
గంభీర సంద్రాన్ని, సౌధాల ప్రపంచాన్ని అలవోకగా మోస్తున్న అవనిని సృష్టించి
ఆ రెంటి నడుమ నన్నుంచి, నిలువెత్తు నాలో గుప్పెడు గుండె ఉంచి
అందున పంచేకొద్దీ పెరిగే ఓ చిటికెడు ప్రేమ ఉంచి
'నేనెవరో తెలుసుకో' అని ఆవల దాగున్నది ఎవ్వరు?

-తేజ

నీ తలపు

  తలిచే నా తలపుకి ఓ పరుగే ఉంటే మరుక్షణం అది  నీ చెంతే ఉండెనులే నా ఎద సవ్వడికో పలుకే ఉంటే అది  నీ పేరే వినిపించెనులే కదిలే నా కన్నులకి ఓ భాషే...