Wednesday 30 October 2019

ఈ పాపం ఎవ్వరిది?


ఓ దుర్మార్గుడి చేతిలో అత్యాచారం చేయబడి, చంపబడిన ఓ తొమ్మిది నెలల పసికందు ఆత్మశాంతికై....ఈ కవితాశ్రు నివాళి 🙏🙏

ఈ పాపం ఎవ్వరిది?
ఈ నేరం ఎవ్వరిది?
ఆడదాన్ని ఆటబొమ్మగా చేసి ఆట ఆడించింది ఓ తరం
ఆటబొమ్మలతో ఆడే ఆడపిల్లల్నీ వదలక అత్యాచారపు ఆట ఆడుతోంది ఈ తరం

ఈ పాపం ఎవ్వరిది?
ఈ నేరం ఎవ్వరిది?
భ్రూణ హత్యలను పాతాళానికి అణగతొక్కాలని ఓ పక్క జరుగుతోంది రణం
మానవ మృగాల పైశాచికత్వానికి పసిపాపలకి సైతం తీరిపోతోంది ఈ భూమితో రుణం

ఈ పాపం ఎవ్వరిది?
ఈ నేరం ఎవ్వరిది?
పాలబుగ్గల పసిపాపలను కామవాంఛతో
చిదిమేస్తోంది ఘోర కలియుగం
పూలమొగ్గల తలపించే ఆ చిన్నారులని కాపాడే వాంఛతో ముందుకు రావాలి నవయుగం

ఈ పాపం ఎవ్వరిది?
ఈ నేరం ఎవ్వరిది?
విచక్షణా జ్ఞానం నే్ర్పించని తల్లిదండ్రులదా?
నైతిక విలువలు నేర్పించని విద్యాలయాలదా?
మార్పు కోసం తలవంచుకుని ఎదురుచూస్తున్న సభ్య సమాజానిదా?
మానవత్వాన్ని మంటగలిపిన ఈ రక్కసులకు కఠిన శిక్షలు విధింపక ముప్పూటలా మేపి పోషిస్తున్న ప్రభుత్వానిదా?

ఈ ఆధునిక యుగాన,
ఎక్కడ నుండి దిగుమతి అయింది దిక్కుమాలిన ఈ వింత జ్వరం అని అంతర్జాలాన్ని అడిగితే,
శోధనా యంత్రాలు సైతం మూగబోతున్నాయి

ఏ గ్రహం నుండి దిగివచ్చాయి ఈ వికృత జీవులు అని అడిగితే, మా సహచరులు కానే కావంటూ గ్రహాంతర జీవులు సైతం వెనుతిరుగుతున్నాయి

'ఏంటమ్మా ఈ ఘోరం' అని ఈ పుడమి తల్లిని అడిగితే, 'ఈ పైశాచిక మృగాలను కన్నది నేనేనా' అంటూ దీనంగా విలపిస్తూ నిలువెల్లా కంపిస్తోంది.

మరి
ఈ పాపం ఎవ్వరిది?
ఈ నేరం ఎవ్వరిది?

-తేజ

Monday 28 October 2019

నాలో నేను


నాలో నేను అనుకున్నానిలా...
నీలా నేనెలా మారానిలా?
నేను కాని మరో నేను నాలో ఎలా?

నాలో నేను ‌శోధించానిలా...
నీ ఉనికి నాలో ఎలా ఇలా?
నేను కాని మరో నేను నాలో ఎలా?

నాలో నేను ‌గమనిస్తున్నానిలా...
నీ తలపు నా శ్వాసతో జతకట్టిందెలా‌ ఇలా?
నేను కాని మరో నేను నాలో ఎలా?

నాలోని నువ్వు నవ్వుతుంటే ఇలా...
నా పెదవులపై చిరునవ్వెలా ఇలా?
నేను కాని మరో నేను నాలో ఎలా?

నాలో నేను ప్రశ్నించుకున్నానిలా...
నాకే తెలియకుండా నన్నెలా మార్చేసావిలా?
నా నుండి నేను పూర్తిగా కనుమరుగయ్యేలా!

-తేజ

Thursday 24 October 2019

శ్రీమాత దర్శనం


కమనీయమైన నీ రూపం కనిపించేను నా కన్నుల్లో
నిను తలచిన ప్రతీ క్షణాన
ఆనంద పారవశ్యంతో నా మది తడిచేను
నిను గాంచిన ఆ ప్రతీ క్షణాన

మహిమాన్విత నీ రూపం కనిపించేను నా మదిలో
నిను తలవని ఆ క్షణాన సైతం
ఆనందభాష్పాలతో నా కన్నులు తడిచేను
నిను గాంచిన అపురూపమైన ఆ క్షణాన

గహనమైన, గుహ్యమైన నీ రూపం కనిపించేను
నా కన్నుల్లో, మరి నా గుండెల్లో  సైతం
నిను తలచిన ప్రతీ క్షణం
మరి నిను తలవని ఆ క్షణం సైతం

ఈ క్షణం, ఆ క్షణం, ప్రతీ క్షణం
నీ దివ్య దర్శనం అందించాలి నాకు
నీ అపార కరుణా కటాక్ష వీక్షణం  🙏🙏

-తేజ

Tuesday 22 October 2019

సప్తవర్ణిక


అరుణిమ వర్ణం నాకెంతో ఇష్టం
అది నీ పెదవులదైనందుకు

శ్వేత వర్ణం నాకెంతో ఇష్టం
అది నీ నవ్వులదైనందుకు

నీలి వర్ణం నాకెంతో ఇష్టం
అది నీ కన్నులదైనందుకు

కెంపు వర్ణం నాకెంతో ఇష్టం
అది నీ సిగ్గుల బుగ్గలదైనందుకు

నీలిమ వర్ణం నాకెంతో ఇష్టం
అది నీ కురులదైనందుకు

పసుపు వర్ణం నాకెంతో ఇష్టం
అది నీ మేనిదైనందుకు

హరిత వర్ణం నాకెంతో ఇష్టం
అది నీవు కట్టిన చీరదైనందుకు

అన్ని వర్ణాలు నాకెంతో ఇష్టం
అవి నీలో ఉన్నందుకు

-తేజ

Friday 18 October 2019

పసిమనసు


జీవితంలో ఎదురయ్యే కొన్ని సంఘటనలు మనకు ఎంతో నేర్పిస్తాయి. మన జీవితంలో చెరగని ముద్ర వేస్తాయి. 
ఈ మధ్యకాలంలో నా జీవితంలో జరిగిన ఒక మరువలేని సంఘటనని మీ అందరితో పంచుకోవాలనే నా ఈ ప్రయత్నం.
ఓ రోజు పనుండి అలా స్కూటర్లో బజారుకు వెళ్లాను. తిరిగి వస్తుండగా కొంచెం రద్దీగా ఉన్న ఒక రహదారిలో ఒక చిన్న పిల్లవాడు నా బండి కి అడ్డంగా వచ్చి నుంచున్నాడు. పది సంవత్సరాలు కూడా పూర్తిగా ఉండవు వాడికి. 
ఒక్కసారిగా నేను బండి ఆపి 'ఏంటమ్మా' అని అడిగాను. వాడు నా దగ్గరగా వచ్చి అక్కా! అక్కా! ఆకలేస్తుంది అక్కా! అన్నాడు. వాడిని చూడగానే చాలా జాలి వేసింది. అంత చిన్న పిల్ల వాడికి డబ్బులు ఇస్తే వాడు ఎక్కడ పారేసుకుంటాడో అని "సరే పదరా, నీకు ఏం కావాలో చెప్పు నేను కొనిపెడతాను" అన్నాను. 
ఆ వీధిలో ఇరు వైపులా చాలానే తినుబండారాలు ఉన్న దుకాణాలు ఉన్నాయి. సరే అని వాడి చెయ్యి పట్టు కొని వాడితో ముందుకి నడిచాను. అక్కడ ఇడ్లీ, దోశ వంటివి దొరికే చిన్న హోటల్ కనబడింది. "పదరా బాబు ఇక్కడ ఏమైనా తిందువు" అన్నాను. వాడు వెంటనే అక్కా, ఇది వద్దు అన్నాడు ముద్దుగా. సరే అని ఇంకొంచెం ముందుకు నడిచాము. అక్కడ గారెలు, బజ్జీలు, పునుగులు లాంటివి దొరికే ఒక బండి కనబడింది. నేను వాడ్ని అక్కడికి తీసుకెళ్ళాను. 
ఇదిగో బాబు అంటూ ఏదో ఆర్డర్ ఇవ్వబోయాను. అంతలో ఆ పిల్లవాడు అక్కా, అక్కా నాకు ఇది కూడా వద్దు అన్నాడు బుంగ మూతితో. అరే ఏంటి ఈ  పిల్లాడు? ఏది అడిగినా వద్దు వద్దు అంటున్నాడు అనుకుంటూ, "సరేలే, ఏం తింటావో నువ్వే చెప్పు" అన్నాను. వాడు ఇంకా ముందుకి చేయి చూపిస్తూ నన్ను తీసుకెళ్తున్నాడు. 
స్వీట్ షాపులు, పండ్ల దుకాణాలు అన్ని దాటేస్తున్నాం. నాకు ఒకటైతే స్పష్టంగా అర్థమైంది వాడికి ఏం కావాలో వాడు ముందే నిర్ణయించుకున్నాడు అని. నేను ఇంకా అటూ ఇటూ చూస్తున్నాను. కానీ అప్పుడు వాడి దృష్టి మాత్రం ఒకచోట ఆగింది. అది రోడ్డుకి అటువైపు ఉన్న ఒక బండి మీద. ఆ బండి చుట్టూ చాలామంది ఉండడంతో అక్కడ ఏముందో నాకు అర్థం కాలేదు. ఆ బండి కేసి చేయి చూపిస్తూ, వెలుగుతున్న ముఖంతో "అదిగో అక్కా, నాకు అదే కావాలి" అన్నాడు.
"ఓహో! సరేలేరా, ఇంతకీ ఏముంది అక్కడ పద చూద్దాం" అంటూ నడిచాము. 
తీరా వెళ్ళి చూశాక ఒక నిమిషం అవాక్కయ్యే పని నావంతయింది. అది చికెన్ పకోడీ అమ్మే బండి. పాపం చిన్న పిల్లవాడు కదా ఆశపడి ఉంటాడు అనుకొని, ఒక ప్లేటు ఆర్డర్ ఇచ్చాను. పిల్లాడు నా చెయ్యి కిందకి గుంజడంతో ఏంటమ్మా అంటూ అడిగాను. అక్కా, నేను ఇది ఇక్కడ తినను, ఇంటికి తీసుకు వెళ్లి తింటాను అన్నాడు. 
'అదేంట్రా చాలా ఆకలి అన్నావ్ కదా ఇక్కడే తినేసేయ్' అన్నా. 
వద్దక్కా, ఇంట్లోనే తింటాను' అని వాడు పట్టుబట్టడంతో, సరే ఐతే అని పార్సిల్ చేయించి ఇచ్చాను. అది తీసుకొని పిల్లవాడు నాకేసి ఆనందంగా చూశాడు. ఇంక ఒక్క క్షణం కూడా ఆగకుండా అక్కడినుంచి పరిగెత్తాడు.
కానీ నా మనసులో 'వీడు ఎందుకు ఇంటికి వెళ్లే తింటానని పట్టుబడుతున్నాడు' అని కొంత అనుమానం వచ్చింది. సర్లే వీడు ఏం చేస్తాడో చూద్దాం అనుకుని వాడి వెనకాలే ఫాలో అయ్యాను. 
రెండు మూడు వీధులు తిరిగాక ఓ ఇరుకు సందులోని ఒక చిన్న ఇంట్లోకి వెళ్లాడు. 
అక్కడ దాకా ఆనందంగా పరుగున వెళ్ళిన వాడు బిక్క మొహంతో అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నాడు. ఏంటో గమనిద్దామని నేను ఆ ఇంటి కిటికీ దగ్గరగా వెళ్ళి నుంచున్నాను. 
"నాన్నా, నాన్నా, ఇదిగో నీకు కావాల్సింది" అంటూ పీకల దాకా తాగేసి దొర్లుతున్న తన తండ్రికి ఆ ప్యాకెట్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. 
పూర్తిగా మత్తులో మునిగిపోయిన తండ్రికి మాత్రం అదేమీ తెలియడం లేదు. వెంటనే వాడు అక్కడే ఓ మూలగా కూర్చొని ఏడుస్తున్న తన తల్లి దగ్గరకు వెళ్ళాడు. 
"అమ్మా, ఇంక ఏడవకు, నాన్నకి కావాల్సిన చికెన్ ముక్కలు నేను తీసుకు వచ్చేసాను. ఇంక నిన్ను కొట్టడు" అని తన చిన్ని చిన్ని చేతులతో ఆమె కన్నీళ్ళు తుడుస్తూ చెప్పాడు. 
ఆమె వెంటనే వాడ్ని దగ్గరికి తీసుకొని ఆశ్చర్యంతో "ఏంటిరా, చికెన్ తెచ్చావా ఎలా తెచ్చావు?" అంటూ నిలదీసింది. ఎంత అడిగినా పిల్లాడు జవాబు ఇవ్వక పోయేసరికి ఆమెకు కోపం వచ్చింది. పిల్లాడిని దండించాలని ఆమె ప్రయత్నించడంతో నేను పరుగున లోపలికి వెళ్ళి ఆపాను. 
ఒక్కసారిగా నన్ను చూడడంతో పిల్లాడు ఇంకా బెదిరిపోయాడు. భయంతో వాళ్ళ అమ్మ వెనకగా దాక్కున్నాడు. పిల్లాడి తల్లి మీరెవరంటూ నన్ను అడిగింది. బాబుని మీరు కొట్టకండి. ఇందులో వాడి తప్పేం లేదు. వాడికి చికెన్ కొనిచ్చింది నేనే. ఇటుగా వెళ్తుంటే మీ మాటలు వినబడి ఇలా లోపలికి వచ్చాను అని సర్ది చెప్పాను. వాళ్ళ అమ్మకి నిజం చెప్పనందుకు పిల్లాడు సంతోషించాడు. అంతలో వాడి ఫ్రెండ్స్ రావడంతో వాడు వాళ్లతో కలిసి ఆడుకోవడానికి బయటకి వెళ్ళిపోయాడు. 
ఇతనేంటి? బాగా తాగి పడిపోయినట్టున్నాడు.ఇంతకీ ఎవరతను అన్నాను. వాడు నా మొగుడండి. బాగా తాగేసి చికెన్ కూర వండలేదని, జ్వరంతో ఉన్నానని కూడా చూడకుండా నన్ను బాగా కొట్టి తాగిన మత్తుకి అలా పడిపోయాడండి. నేను రోజు కూలి పని చేసి తెచ్చిన డబ్బులతోనే మా ఇల్లు గడుస్తుంది. రెండు రోజులు బట్టి జ్వరం వల్ల నేను కూలికి వెళ్ళలేదు. చేతిలో చిల్లిగవ్వ లేదు. అదేమీ పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు చికెన్ వండుతావా లేదా అని నన్ను కొడుతుంటే, "అమ్మని కొట్టద్దు", అని పిల్లాడు ఏడుస్తూ పారిపోయాడు. ఇదిగో ఇప్పుడు ఇలా చికెన్ పట్టుకొని వచ్చాడు. ఎక్కడ ఎవర్ని అడుక్కొని తెచ్చాడో అని కోపంతో వాడిని కొట్టబోయాను అంది నీరసంగా. నాకు ఒక్కసారిగా పిల్లాడు ఎందుకు అలా చేసాడో అంతా అర్థం అయిపోయింది. ఆ పసివాడు కళ్ళ ముందు మెదిలాడు.
తండ్రి తన తల్లిని కొడుతుంటే చూడలేక ఆ పసి మనసు ఎంతగా నలిగి పోయిందో నాకు అర్ధం అయ్యింది. జరిగింది ఇది అని నేను చెబితే ఆమె వాడిని ఖచ్చితంగా దండిస్తుంది. అందుకే నేను మౌనంగా అక్కడినుండి బయటికి వచ్చేశాను.

నవమాసాలు మోసి జన్మనిచ్చి, కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తన తల్లిని కాపాడటం కోసం ఆ  పసివాడు చేసిన పని తలుచుకుంటుంటే నా హృదయం బరువెక్కిపోయింది. ఏం చేసైనా వాళ్ళ అమ్మని కాపాడుకోవాలి అనుకున్నాడు అదే చేశాడు.

"అమ్మ కంటేనే వచ్చిన ఈ జన్మ అమ్మ కంటేనా?" అనుకున్న ఆ పసి మనసుని చూసి మనం ఎంతో నేర్చుకోవాలి.

-తేజ








Monday 14 October 2019

స్వేద సందేశం


తలపుల జడిలో  స్వేదంగా ఎదిగిన నీవు       
వలపుల వేడిలో ఆవిరిగా ఎగిసి
మేఘపు ఒడిలో చల్లగా దాగి
మెరుపు వడితో తియ్యగా సాగి
మలుపు ఎరుగక కడలిని తాకి
అలుపు ఎరుగని లహరిగా మారి
తీరపు తెన్నెల సేద తీరుతున్న నా చెలిని తాకి...
నా హృదయపు మధురపు సందేశాన్ని పదిలంగా అందించగలవా ఓ చిరు నేస్తమా!

-తేజ

Sunday 13 October 2019

అంతరాత్మ అంతరంగం



లోనుంచి చూస్తున్నా మౌనంగా..
దేహమనే ఇంటి కిటికీ లోనుంచి చూస్తున్నా దీనంగా..

శాశ్వతం కాని ఓ అశాశ్వతం, ఇంకెన్నో అశాశ్వతాల కోసం నిత్యం చేస్తున్న జీవన పోరాటాన్ని,
స్థిమితమే లేక అస్తిత్వం కోసం ఆరాటాన్ని,ఆస్తిపాస్తుల కోసం నిత్యం చేస్తున్న విశ్వ ప్రయత్నాన్ని

లోనుంచి చూస్తున్నా మౌనంగా..
దేహమనే ఇంటి కిటికీ లోనుంచి చూస్తున్నా దీనంగా..

నిన్నటి ముఖ్యాలన్నీ నేడు వ్యర్థాలకు ప్రతీకగా నిలుస్తున్నా, నేటి ముఖ్యాల కోసం నిత్యం చేస్తున్న జీవన పోరాటాన్ని,
అనిత్యపు ఈ ఆస్థానంలో, అక్కరకు రాని పేరుప్రశంసల కోసం నిత్యం చేస్తున్న విశ్వ ప్రయత్నాన్ని

లోనుంచి చూస్తున్నా మౌనంగా..
దేహమనే ఇంటి కిటికీ లోనుంచి చూస్తున్నా వింతగా..

ప్రవాహంలా పరుగాపక పోటీ పడుతూ నేనూ
చేస్తున్నా నిత్యం ఈ జీవన పోరాటం
అద్వైతాన్ని అటకెక్కించి, ద్వైతమనే సిరాలో పవిత్రాత్మని ముంచుతూ తేలుస్తూ నా అధోగతికి,
నేనే చేసుకుంటున్నా విశ్వ ప్రయత్నం

లోనుంచి చూస్తున్నా మౌనంగా..
దేహమనే ఇంటి కిటికీ లోనుంచి చూస్తున్నా వింతగా..

అంతరాత్మ అంతరంగాన్ని పెడచెవిన పెడుతూ, విషయవాంఛలకై నేనూ చేస్తున్నా నిత్యం ఈ జీవన
పోరాటం
ప్రక్షాళన పర్వం ఇకనైనా అమలు పెట్టకుంటే వృధా అయ్యేను పవిత్రమైన ఆ పరమాత్మని చేరే నా విశ్వ ప్రయత్నం

-తేజ

Saturday 12 October 2019

వంచన ప్రేమ


మోసపు సిరాతో నింపిన ప్రేమ కలం నీదైతే
రక్తపు సిరాతో రాసుకున్న ప్రేమ కథ నాది

మోసపూరితమైన ప్రేమ వల నీదైతే
అర్ధాంతరంగా చెదిరిన ప్రేమ కల నాది

జలధి తీరపుతెన్నెలపై స్వార్థంతో రాసిన
మాయాక్షరాలు నీవైతే
హృద్గది గోడలపై నమ్మకంతో రాసుకున్న
ప్రేమాక్షరాలు నావి

అంచనాలకి అందని వంచన ప్రేమ నీదైతే
మది అంచున కంచెనల్లిన అరుదైన ప్రేమ నాది

-తేజ

జ్ఞాపకాల చెలిమి


జ్ఞాపకాల పూదోటలో నిరంతరం విహరిస్తున్న తూనీగని నేను అని గర్వించేదాన్ని
ఆందమైన ఆ పూదోటల గుబాళింపులను నిరంతరం ఆస్వాదిస్తున్న ఓ తేనీగలాంటి
నిన్ను చూసేవరకు

జ్ఞాపకాల పుస్తకాన్ని మదిలో పదిలంగా దాచేసానని నేను ఎప్పుడూ గర్వించేదాన్ని
ఆ పుస్తకాన ఉన్న ప్రతి అక్షరాన్నీ మదిలో ఎప్పటికీ ముద్రించుకున్న
నిన్ను చూసేవరకు

జ్ఞాపకాల జడివానలో హాయిగా తడుస్తున్నాని నేను ఎప్పుడూ గర్వించేదాన్ని
ఆ వానలో మైమరచి తడుస్తూ ఓ మయూరంలా నాట్యమాడుతున్న
నిన్ను చూసేవరకు

-తేజ

Friday 11 October 2019

ప్రకృతి ఆక్రందన


స్వార్థ ప్రయోజనాల కోసం మన జాతి
నిస్వార్థపు వృక్షాలను తెగ నరుకుతుంటే...
దిక్కులు పిక్కటిల్లేలా ప్రకృతి ఆక్రోశిస్తోంది
కానీ అది అరణ్యరోదనగా మిగిలిపోతోంది

సాంకేతిక పరిజ్ఞానంతో మన జాతి
విజ్ఞానం మరిచి ప్రవర్తిస్తుంటే...
భూమి వేడెక్కేలా ప్రకృతి నిట్టూరుస్తోంది
కానీ అది వడగాల్పుల వేడిలో ఆవిరైపోతుంది

సమతౌల్య సాధనాలైన సహజ వనరుల్ని మన జాతి విచక్షణా రహితంగా నాశనం చేస్తుంటే...
గొంతు చించుకొని ప్రకృతి విలపిస్తోంది
కానీ అది ఉరుముల, పిడుగుల గర్జనలో ఏకమైపోతోంది

పారిశ్రామీకరణ పేరుతో మన జాతి,
పర్యావరణాన్ని కాలుష్యపు కోరల్లో నిలబెడుతుంటే...
గుండె పగిలేలా ప్రకృతి రోదిస్తోంది
తన కన్నీటి మేఘాలతో వర్షిస్తోంది
కానీ ఆ కన్నీరు సెలయేళ్ళ, సంద్రాల నీటిలో కలిసిపోతోంది

ప్రకృతి పలుకుతోంది
తన ఆవేదన వివరిస్తోంది
పరికించి వింటే అది మన అందరి
గుండె సవ్వడిలో తప్పకుండా వినిపిస్తుంది

భావితరాల భవిష్యత్తు కోసం,
సామాజిక స్పృహతో పయనిద్దాం ముందుకు
పతనమవుతున్న పర్యావరణాన్ని కాపాడేందుకు

-తేజ

Monday 7 October 2019

దసరా శుభాకాంక్షలు


శ్రీదేవి శ్రీమాత లలితాంబికా
జగమేలు మాయమ్మ జగదంబికా
విజయదశమి నాడు విజయములనీయగ శీఘ్రమే రావమ్మ కరుణా తరంగికా

సౌమ్య రూపంలోనూ, శాక్తేయ రూపంలోనూ శరన్నవరాత్రులూ పూజలందుకున్నా,
దశమి నాడు మా దుర్గతులను తొలగించ శీఘ్రమే రావమ్మ విజయదుర్గగా

అలంకారాలు వేరైనా ఆదిశక్తియైన అమ్మ ఒక్కటే
అండపిండ బ్రహ్మాండలను కాపాడేది అమ్మ దయ ఒక్కటే
బిడ్డలు వేరైనా అందరిపట్ల అమ్మ ప్రేమ ఒక్కటే
అస్తిత్వం ఏదైనా నిను నడిపించేది అమ్మ దయ ఒక్కటే
నీలోని కాఠిన్యం ఎంతైనా నిను రక్షించేది అమ్మ కారుణ్యం ఒక్కటే

అందరికి విజయదశమి శుభాకాంక్షలు

-తేజ

శ్రీమాత


శ్రీమాతా 🙏🙏

ఎర్రని నీ కాంతులు నా పాపాలను కడిగేస్తుంటే
పచ్చని నీ వన్నెలు రక్షలై నన్ను చుట్టెయ్యాలి

నల్లని నీ కురులు నా అఙ్ఞానపు చీకట్లని తుడిచేస్తుంటే
తెల్లని నీ నవ్వులు దీవెనలై నన్ను తడిపెయ్యాలి

వెచ్చని నీ ఒడి నన్ను లాలిస్తుంటే
చల్లని నీ చూపులు నాపై కరుణను కురిపించాలి

మెత్తని నీ కరములు నన్ను దీవిస్తుంటే
అందెల నీ చరణకమలాలను భ్రమరమై నేను ఆస్వాదించాలి 🙏🙏

-తేజ

Wednesday 2 October 2019

శ్రీమాత


ఎర్రని కాంతుల చల్లని చూపుల మాయమ్మ  శ్రీమాతా, నిన్ను నా మనసారా ధ్యానిస్తున్నాను.

ఎల్లవేళలా శుభములను చేకూర్చమంటూ మాయమ్మ శ్రీకరీ, నిన్ను నాలోకి ఆహ్వానిస్తున్నాను.

ఎప్పుడూ పద్మాసనియైన మాయమ్మ శ్రీలలితా,
నీకు నా హృదయాసనం సమర్పిస్తున్నాను.

ఎన్నో లోకాలకు ఆలంబనయైన మాయమ్మ శ్రీకళా,
నీకు నా ఆనందభాష్పాలతో అర్ఘ్యపాద్యాదులు సమర్పిస్తున్నాను.

ఎందరో భక్తులకు కొంగుబంగారమైన మాయమ్మ  శ్రీనిథీ, నీకు భక్తిప్రేమలనే వస్త్రయుగ్మములను సమర్పిస్తున్నాను.

ఎన్నో దేవలోక పుష్పములకే సౌరభాన్ని అద్దే మాయమ్మ శ్రీదేవీ, నీకు నా తలపులతో కట్టిన  పుష్పమాలను అలంకరిస్తున్నాను.

ఎంతో తేజోమూర్తివైన మాయమ్మ శ్రీదివ్యా,
నీకు నా ఆశాజ్యోతులతో కూడిన శ్వాసాదీపాలను సమర్పిస్తున్నాను.

ఎందరో అన్నార్తులకు అన్నపూర్ణవైన మాయమ్మ శ్రీవాణీ, నీకు నా పలుకులే నైవేద్యంగా సమర్పిస్తున్నాను.

ఎల్లవేళలా నా అజ్ఞానాన్ని తొలగించి నన్ను రక్షించమంటూ మాయమ్మ శ్రీవిద్యా, నీ పాదపద్మములకు సర్వస్యశరణాగతి చేస్తున్నాను.

- తేజ

నీ తలపు

  తలిచే నా తలపుకి ఓ పరుగే ఉంటే మరుక్షణం అది  నీ చెంతే ఉండెనులే నా ఎద సవ్వడికో పలుకే ఉంటే అది  నీ పేరే వినిపించెనులే కదిలే నా కన్నులకి ఓ భాషే...