Tuesday 31 March 2020

మనసు నవ్వింది


పలికే నీ కన్నులను చూస్తూ..పలకడమే మరచిన
నా పెదవుల్ని చూసి
నా మనసు మొదటిసారి నవ్వింది

విరిసే నీ పెదవుల్ని చూస్తూ..విరియడమే మరచిన
నా గళాన్ని చూసి
నా మనసు మరోసారి నవ్వింది

కదిలే నీ ముంగురుల్ని చూస్తూ..కదలడమే మరచిన
నా తీరుని చూసి
నా మనసు ఫక్కున నవ్వింది

చెప్పలేనంత నీ అందాన్ని చూస్తూ..అసలు విషయం చెప్పడమే మరచిన నన్ను చూసి
నా మనసు మళ్లీ నవ్వింది

ప్రేమించే నీ మనసుని చూస్తూ.. దానితో ముడి పడుతున్న తనని తాను చూసుకుంటూ
నా మనసు మళ్లీ మళ్లీ నవ్వుతోంది

-తేజ

Monday 30 March 2020

స్తబ్ధత


స్తబ్ధత

ఎన్నడు ఊహించని ఓ స్తబ్ధత
మనిషి మనుగడలో ఓ స్తబ్ధత
బతుకు గమనంలో ఓ స్తబ్ధత
పవిత్ర దేవాలయాల్లో ఓ స్తబ్ధత
భవిత విద్యాలయాల్లో ఓ స్తబ్ధత
నడి వీధుల్లో ఓ స్తబ్దత
ప్రజా విధుల్లో ఓ స్తబ్దత
వలస కూలీల బతుకుల్లో ఓ స్తబ్ధత
విలాసవంతుల ఇళ్ళల్లోనూ ఓ స్తబ్ధత

నీ నా అడుగులలో ఓ స్తబ్ధత
నా నీ మనసులలో ఓ స్తబ్ధత

కాలంలో ఓ సందిగ్ధ స్తబ్ధత
నా ఈ కలంలో ఓ స్తబ్ధత
కలికాలపు ఓ నిశ్శబ్ద స్తబ్ధత

ఇది ప్రక్షాళన పర్వమా? లేకుంటే
ప్రాయశ్చిత్తపు కర్మమా?

ఇది జగాన ప్రకృతి వైపరీత్యమా? లేకుంటే
దుర్జనుల వికృత చేష్టల ఫలితమా?

-తేజ

Thursday 26 March 2020

కరోనా కలకలం


కరోనా కలకలం

ఎటు చూసినా అస్తవ్యస్తం
ఎటు చూసినా అందోళన
ఎటు చూసినా అయోమయం
జనజీవన స్రవంతిలో చెలరేగింది ఓ కలకలం

ప్రపంచ విహారయాత్రకు కరోనా పేరుతో
వచ్చింది ఓ నిరాకార శత్రువు
నిరాకారమే కానీ నిలువెల్లా మారణాయుధం
ప్రపంచ దేశాలన్నింటి పైన ఒక్కసారిగా
ఝుళిపించింది తన కబంధ హస్తం
మానవ జాతి మనుగడపై సంధించింది తన దేహశరం

రూపం లేనిదని చిన్న చూపు వద్దు
ఆయుధమే లేని శత్రువు అని అసలే అనుకోవద్దు

బలవంతపు ఆతిథ్యం దాని తొలిమెట్టు
దేహాన్ని పూర్తిగా ఆవరించడం దాని కనికట్టు
ప్రాణాన్ని నిలువెల్లా తీయడం దాని తుదిపట్టు

దుష్టులకు దూరంగా ఉండాలన్న ఓ నీతి వాక్యాన్ని గుర్తించి అనుసరిద్దాం
ఇంటికే పరిమితమవుతూ దుష్ట కరోనాను
దరిచేరకుండా ఆపుదాం

-తేజ

Saturday 21 March 2020

నిశ్శబ్ద(కర్ఫ్యూ) తరంగాలు



నిశీధిలోని నిశ్శబ్దాన్ని కొత్తగా పగటివేళ చవి చూసిన సూరీడు, 'గతి తప్పి నేను త్వరగా ఉదయించానా' అని తడబడుతూ మబ్బుల్లో కెళ్ళి తారలతో మంతనాలు చేసొస్తుంటే,

రణగొణ ధ్వనులు, శకటపు చక్రాల శబ్దాలు ఒక్కసారిగా ఆగిపోవడంతో నా బిడ్డలకేమయిందంటూ తల్లడిల్లిన భూమాత కాలచక్రాన్ని ఆరా తీస్తుంటే,

అంతరించి పోయాఏమో అనుకున్న కొన్ని పక్షుల కిలకిలరావాలు, మేము సైతం మీ సహచరులమే అంటూ మనకి గుర్తు చేస్తూ ప్రతిధ్వనిస్తుంటే,

కృత్రిమ ధ్వనుల మధ్య పుట్టి పెరుగుతున్న నవతరపు పసిపాపలు పక్షుల ధ్వనులను పరికించి ఆస్వాదిస్తుంటే,

పులకించిన ప్రకృతి మాత ఆనందంతో తల ఊపుతూ విడుస్తున్న ఆహ్లాదకరమైన చిరుగాలి ఇప్పుడే నన్ను తాకి, నిన్ను చేరేందుకు అటుగా వస్తోంది, నువ్వు కూడా పలకరించు నేస్తమా!

-తేజ

నీ తలపు

  తలిచే నా తలపుకి ఓ పరుగే ఉంటే మరుక్షణం అది  నీ చెంతే ఉండెనులే నా ఎద సవ్వడికో పలుకే ఉంటే అది  నీ పేరే వినిపించెనులే కదిలే నా కన్నులకి ఓ భాషే...