Tuesday 14 April 2020

కరోనా అనే నేను



కరోనా అనే నేను ✍✍

కరోనా అనే నేను
నాకే తెలియని ఓ కాలంలో
నాకే తెలియని ఈ లోకంలో
అణువంతై అంకురించి
చైనీయుల చేతిలో చిగురించి
విశ్వమంతా వ్యాపిస్తున్న ఓ వైరస్ని నేను

విశ్వానికి అలా ఓ విహారయాత్రకు వచ్చాను నేను
విశ్వమే విస్తుపోయెంత విశ్వవ్యాపిని నేను
విశ్వాన్నే చుట్టేయగల విమానాలకే విశ్రాంతినిచ్చాను నేను

విశ్వమెంత నా ముందు అని విర్రవీగుతున్న మనుషుల కుప్పి గంతులనే కట్టడి చేసాను నేను.
విద్యలను, వాణిజ్య వ్యాపారాలను, విందులను, విలాసాలను, వినోదాలను సైతం మూకుమ్మడిగా స్తంభింప చేశాను నేను
ఆఖరుకి మనుషుల ఉచ్ఛ్వాస నిశ్వాసలకే ఓ అడ్డు తెరను (మాస్క్) ధరింప చేసాను నేను

కదనరంగంలో కత్తి లేని ఒంటరి వీరుడిని నేను
కలసి ఉంటే కబళించేస్తాను అని బెదిరించి ప్రజలందరినీ విభజించేశాను నేను
ఎక్కడి వారు అక్కడే గప్ చుప్ అంటూ శాసించాను నేను
ఆఖరుకి మనుషులకి వివిక్తవాసమనే శిక్షని విధించాను నేను 
ఒకప్పటి అంటరానితనాన్ని మళ్ళీ చూసి ఆనందిస్తున్నాను నేను

విశ్వ మానవ జగతి వినాశనం నాకో వినోదభరిత విశ్వకేళి
విలయ తాండవం చేయమని మృత్యువునే శాసించాను నేను
ఆఖరుకి మృత్యువునొందిన వారిని చివరి చూపు చూసేందుకూ దారులు లేక కట్టి పడేసాను నేను.
దైన్యంగా రోదిస్తున్న వారి అశ్రువులను దప్పిక తీరని నా దాహానికి అర్ఘ్యమిస్తున్నాను నేను

కరోనా అనే నేను
కబళించేస్తాను అందర్నీ నేను

-తేజ

No comments:

Post a Comment

నీ తలపు

  తలిచే నా తలపుకి ఓ పరుగే ఉంటే మరుక్షణం అది  నీ చెంతే ఉండెనులే నా ఎద సవ్వడికో పలుకే ఉంటే అది  నీ పేరే వినిపించెనులే కదిలే నా కన్నులకి ఓ భాషే...