Wednesday 26 June 2019

నేనెవరో తెలుసుకో

సుందర సుకుమార మంజుల మందార వర్ణ భరిత పుష్పాలెన్నో సృష్టించి
సుమధుర మకరందాల మధువులను నింపి
అందున సౌగంధిక ముగ్ధ మనోహర పరిమళాలను పొదిగి
'నేనెవరో తెలుసుకో' అని ఆవల దాగున్నది ఎవ్వరు?

శీతల శ్వేతపు తుషార శిఖరాలను,జలజల జారేటి జలపాతాలను సృష్టించి
ఉరుకుల పరుగుల ప్రవహిస్తున్న నదులుగా మార్చి
అందున ఔషధ గుణాలను,జీవుల ప్రాణాధారాన్ని దాచి
'నేనెవరో తెలుసుకో' అని ఆవల దాగున్నది ఎవ్వరు?

సంద్రాల నీటిని ఆవిరిగా మార్చి, రాగాల మేఘాలను సృష్టించి
అరిచేటి ఉరుములు, మెరిసేటి మెరుపుల మధ్య కురిసేటి వర్షాలను సృష్టించి
పరవశించి ఆడే మయూరాలను, వయ్యారి వానవిల్లును సృష్టించి
అందున ఎన్నెన్నో వర్ణాలని దాచి
'నేనెవరో తెలుసుకో' అని ఆవల దాగున్నది ఎవ్వరు?

యుగయుగాల తరబడి మూగ మౌనుల్లాగా నిశ్చలమై నిల్చిన గిరులను సృష్టించి,
మాటెరుగని మానుల్ని, పశుపక్షుల్ని సృష్టించి
పచ్చని పైరు పాపలను చల్లగా లాలించే చిరుగాలిని సృష్టించి
అందున అలవోకగా శ్వాసవాయువును దాగుంచి
'నేనెవరో తెలుసుకో' అని ఆవల దాగున్నది ఎవ్వరు?

సూర్యచంద్రుల్ని, చుక్కల్ని ఒడిసి పట్టుకునే ఆకాశాన్ని సృష్టించి
గంభీర సంద్రాన్ని, సౌధాల ప్రపంచాన్ని అలవోకగా మోస్తున్న అవనిని సృష్టించి
ఆ రెంటి నడుమ నన్నుంచి, నిలువెత్తు నాలో గుప్పెడు గుండె ఉంచి
అందున పంచేకొద్దీ పెరిగే ఓ చిటికెడు ప్రేమ ఉంచి
'నేనెవరో తెలుసుకో' అని ఆవల దాగున్నది ఎవ్వరు?

-తేజ

No comments:

Post a Comment

నీ తలపు

  తలిచే నా తలపుకి ఓ పరుగే ఉంటే మరుక్షణం అది  నీ చెంతే ఉండెనులే నా ఎద సవ్వడికో పలుకే ఉంటే అది  నీ పేరే వినిపించెనులే కదిలే నా కన్నులకి ఓ భాషే...