Thursday 30 April 2020

నీ స్నేహం


కల అననా, కథ అననా నీ స్నేహాన్ని
కల అంటే చెదిరిపోతుంది
కథ అంటే ముగిసిపోతుంది
అందుకే తియ్యని కావ్యమంటాను
కలకాలం గుర్తుండిపోతుంది

గతమననా, గమనమననా నీ స్నేహాన్ని
గతం అంటే ఇంక తిరిగి రాదు
గమనమంటే ఏదో రోజు ఆగిపోతుంది
అందుకే జ్ఞాపకం అంటాను
కలకాలం నిలిచిపోతుంది

చిత్రమననా, చరితమననా నీ స్నేహాన్ని
చిత్రమంటే మాయమైపోతుంది
చరితమంటే పుటల్లో దాగిపోతుంది
అందుకే చిరునవ్వు అంటాను
కలకాలం కోరుకుంటాను

తుషారమననా, తుఫాననా నీ స్నేహాన్ని
తుషారం అంటే కరిగిపోతుంది
తుఫాన్ అంటే వచ్చి పోతుంది
అందుకే తొలకరి చిరుజల్లు అంటాను
కలకాలం ఎదురు చూస్తూ ఉంటాను

ఆశ అననా, పాశమననా నీ స్నేహాన్ని
ఆశ అంటే ఏదో రోజు తీరిపోతుంది
పాశమంటే ఏదో రోజు వీడి పోతుంది
అందుకే శ్వాస అంటాను
కలకాలం నాతోనే ఉండిపోతుంది

-తేజ

2 comments:

నీ తలపు

  తలిచే నా తలపుకి ఓ పరుగే ఉంటే మరుక్షణం అది  నీ చెంతే ఉండెనులే నా ఎద సవ్వడికో పలుకే ఉంటే అది  నీ పేరే వినిపించెనులే కదిలే నా కన్నులకి ఓ భాషే...